గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : గురువారం, 28 జనవరి 2016 (17:25 IST)

స్మార్ట్ సిటీలు : ఏపీకి 2, తెలంగాణాకు 0 - తెలంగాణాను కాకి ఎత్తుకు పోయిందా?: సీఎం కేసీఆర్

స్మార్ట్ సిటీల జాబితాను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రెండు ప్రాంతాలు చోటుదక్కించుకున్నాయి.వాటిలో ఒకటి విశాఖపట్టణం కాగా, మరొకటి కాకినాడ. కానీ, కొత్తగా ఏర్పాటైన, దేశంలో రెండో ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ నుంచి ఒక్క ప్రాంతాన్ని కూడా ఎంపిక చేయలేదు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ మ్యాప్ నుంచి తెలంగాణాను కాకి ఎత్తుకెళ్లిందా అంటూ ఫైర్ అయ్యారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ... దేశంలో 20 స్మార్ట్ సిటీలు ప్రకటిస్తే అందులో ఆంధ్రాకు రెండు ఇస్తే.. తెలంగాణకు ఒక్కటి కూడా లేదు. అదే ఆంధ్రాలో విశాఖపట్టణం, కాకినాడ ఉన్నాయని అన్నారు. దీనికి వెంకయ్యనాయుడు సమాధానం ఏం చెబుతారు? వెంకయ్యనాయుడు అంత్యప్రాసలు.. ఆది ప్రాసల గురించి అందరికీ తెలుసు. వెంకయ్యనాయుడు లాగా నేను కూడా ప్రాసలతో మాట్లాడగలను. 
 
తెలుగు నాకు చక్కగా వచ్చు. చిల్లర ప్రచారాల ద్వారా కేసీఆర్‌పై పైచేయి సాధించాలనుకోవడం సరికాదు అని సీఎం కేసీఆర్ ఘాటుగా విమర్శించారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉన్నది రాజ్యాంగబద్దమైన సంబంధాలే కానీ రాజకీయ సంబంధాలు కాదని గుర్తించాలన్నారు. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరించే తీరు ఈ ప్రాంత ప్రజలను తీవ్ర మనస్థాపానికి గురి చేస్తుందన్నారు.