బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (10:18 IST)

తెలంగాణ పౌరులకిచ్చే సిటిజన్ కార్డు శాంపిల్ సిద్ధంకాలేదు!

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం జారీ చేసే ఆధార్ కార్డు తరహాలో తెలంగాణ పౌరులకు సిటిజన్ కార్డును ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ కార్డు జారీ కోసం అనేక రకాలుగా కార్డులను రూపొందిస్తున్నప్పటికీ ఏ ఒక్కదాన్ని ఇంకా ఖరారు చేయలేదు. శాంపిల్స్ కార్డులు కూడా విడదల చేయలని టీ ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
నిజానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రత్యేకంగా సిటిజన్ కార్డుల పేరుతో గుర్తింపుకార్డులివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేస్తున్న విషయం తెల్సిందే. అలాగే, ప్రభుత్వ పథకాల లబ్దిదారులను ఎంపిక చేయడం కోసం ఆగస్టులో సామాజిక ఆర్థిక స్థితిగతుల సర్వేను చేయించాలని కూడా నిర్ణయించింది. ఈ సర్వే వల్ల పథకాలు ఎవరికి అమలు చేయాలో తేలుతుందని కేసీఆర్ భావిస్తున్నారు. 
 
ఇళ్లు, రేషన్ కార్డులు లాంటి ప్రభుత్వ పథకాల్లో భారీ స్థాయిలో అవినీతి జరుగుతున్న నేపథ్యంలో ఈ సర్వే ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత తెలంగాణ పౌరులకు పాన్ కార్డు తరహాలో తెలంగాణ సిటిజన్ కార్డులు ఇస్తామని, ఈ కార్డులు బహుళ ప్రయోజనకార్డులుగా ఉంటాయని కేసీఆర్ కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి.