శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 26 అక్టోబరు 2015 (09:25 IST)

నేడు ఢిల్లీకి టీ సీఎం కేసీఆర్... అందుకోసమే వెళుతున్నారా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం హస్తినకు వెళుతున్నారు. మంగళవారం ఢిల్లీలో జరుగనున్న నీతి ఆయోగ్‌ భేటీలో ఆయన పాల్గొంటారు. ఉపసంఘం కన్వీనర్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌‌ ఆహ్వానం మేరకు కేసీఆర్ ఢిల్లీకి వెళుతున్నారు. రాష్ట్రానికి రుణ పరిమితి పెంచాలన్న ప్రతిపాదన కూడా ఈ ఉపసంఘం పరిధిలోనే ఉంది. రేపటి సమావేశంలో ఉపసంఘం నివేదికను ఖరారు చేయనున్నారు.
 
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల సమీక్ష కోసం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ సమన్వయకర్తగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నీతి అయోగ్ ఉప కమిటీ ఏర్పాటైంది. ఇది ఇప్పటికే పలుమార్లు భేటీ అయింది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమాలపై చర్చించింది. అయితే చాలా రాష్ట్రాలు  ప్రభుత్వ పథకాలకు కేంద్రం నిధులను తగ్గించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ సమయంలో మంగళవారం జరిగే సమావేశం అత్యంత కీలకంకానుంది. 
 
ఈ సమావేశం తర్వాత ఉప సంఘంలోని ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమవుతారు. నీతి అయోగ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రధానికి వివరించడంతోపాటు నివేదిక సమర్పించనున్నారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కేసీఆర్ రాష్ట్ర పర్యటనకు ఆహ్వానించనున్నారు. ముఖ్యంగా.. డిసెంబర్‌లో తాను నిర్వహించనున్న చండీయాగానికి రావాలని ప్రధానిని ఆహ్వానించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.