మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (12:16 IST)

సింగపూర్‌లో అడుగుపెట్టిన కేసీఆర్ బృందం : తొలిసారి విదేశీ టూర్!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీఆర్ఎస్ అధినేత, కేంద్ర మాజీ మంత్రి కె చంద్రశేఖర్ రావు సోమవారం తన జీవితంలోనే తొలి విదేశీ పర్యటన చేపట్టారు. ఆయన సోమవారం ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్‌కు చేరుకున్నారు. సింగపూర్‌లోని రిట్జ్ కార్టన్ హోటల్ వద్ద కేసీఆర్‌కు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. 
 
నాలుగు రోజుల తన పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు స్పోర్ట్స్ స్టేడియంను ఆయన పరిశీలిస్తారు. గురువారం ఉదయం 11 గంటలకు హైకమిషనర్‌తో, సాయంత్రం 4 గంటకు విదేశాంగ మంత్రితో సమావేశమవుతారు.
 
22వ తేదీన ఇంఫాక్ట్ సదస్సులో పాల్గొన్న అనంతరం సాయంత్రం 5 గంటలకు సింగపూర్ ప్రభుత్వ పెద్దలతో ఆయన సమావేశమవుతారు. 23న సింగపూర్ నుంచి రోడ్డు మార్గంలో ఆయన కౌలాలంపూర్ చేరుకుంటారు. 24 రాత్రికి కేసీఆర్ అక్కడ నుంచి హైదరాబాద్ తిరుగుపయనమవుతారు. 
 
కాగా, ఈ పర్యటన కోసం ఆయనకు మూడు రోజుల క్రితమే పాస్ పోర్టును మంజూరు చేశారు. ఇప్పటి వరకు ఆయనకు పాస్ పోర్టు లేదు. కేంద్ర కార్మిక శాఖామంత్రిగా పని చేసినప్పటికీ ఆయనకు పాస్ పోర్టు లేకుండానే కాలం వెళ్లదీశారు.