మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : మంగళవారం, 26 మే 2015 (16:01 IST)

ఇక నుంచి మాటలు బంద్, కేవలం పనులే జరగాలి: కేసీఆర్

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం విజయవంతమయిందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నగరంలో చెత్త తరలింపు సమస్య కూడా తీవ్రంగా ఉందని, నగరానికి 50 కి.మీ. దూరంలో చెత్త డంపులను ఏర్పాటు చేస్తామన్నారు. చాలా చోట్ల మంచి నీరు, మురుగు నీరు కలసి సరఫరా అవుతోందని కేసీఆర్ తెలిపారు. దీనివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని ఆయన చెప్పారు. 
 
ఇకనుంచి మాటలు బంద్, కేవలం పనులే జరగాలని చెప్పారు. ఎంత డబ్బైనా ఇస్తాం.. రాజకీయాలకు అతీతంగా అందరు నేతలు పనులను పర్యవేక్షించాలని కేసీఆర్ కోరారు. ఇప్పుడు జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో హైదరాబాదును సరిచేసుకోలేమని తెలిపారు. హైదరాబాదులోని 'ఎంసీఆర్ హెచ్ఆర్డీ'లో స్వచ్ఛ హైదరాబాద్‌పై కేసీఆర్ సమావేశం నిర్వహించారు. 
 
ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, కంటోన్మెంట్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, నగరంలో 390 కిలోమీటర్ల పొడవైన 72 నాలాల పరిస్థితి బాగాలేదని... వర్షపు నీరు వెళ్లాల్సిన నాలాల్లో మురికి నీరు వెళుతోందని చెప్పారు. నాలాల నీళ్లలోకి కూడా కట్టడాలు వచ్చాయని తెలిపారు. వీటన్నింటినీ సరిచేస్తామన్నారు.