ప్రత్యేక విమానంలో ఆంధ్రకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... ఎందుకు?

KCR
శ్రీ| Last Modified శనివారం, 22 డిశెంబరు 2018 (14:35 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 23 నుంచి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, దేశ రాజధాని న్యూఢిల్లీలో పర్యటించనున్నారు. టీఆర్ఎస్ పార్టీ కోసం నెల రోజుల పాటు ఎంగేజ్ చేసుకున్న ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యులతో పాటు ఈ నెల 23న ఉదయం 10 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి విశాఖపట్నం బయలుదేరుతారు.
 
విశాఖలో శారదా పీఠాన్ని సందర్శిస్తారు. పీఠంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు జరుపుతారు. స్వామి స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులు తీసుకుంటారు. ఆశ్రమంలోనే మధ్యాహ్న భోజనం చేస్తారు. 
 
ఆ తర్వాత విశాఖ విమానాశ్రయం నుండి ఒడిశా రాజధాని భువనేశ్వర్ బయలుదేరుతారు. సాయంత్రం 6 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌‍తో ఆయన నివాసంలోనే సమావేశం అవుతారు. ఆ రోజు సీఎం అధికార నివాసంలోనే బస చేస్తారు. 24న ఉదయం రోడ్డు మార్గం ద్వారా కోణార్క్ దేవాలయం సందర్శిస్తారు. 
 
అనంతరం జగన్నాథ దేవాలయాన్ని సందర్శిస్తారు. పూజల అనంతరం భువనేశ్వర్ చేరుకుని మధ్యాహ్న భోజనం చేస్తారు. అక్కడ నుండి ప్రత్యేక విమానంలో కోల్‌కతా వెళ్తారు. సాయంత్రం 4 గంటలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో సమావేశం అవుతారు. అనంతరం కాళీమాత దేవాలయాన్ని సందర్శిస్తారు. అదేరోజు రాత్రి ఢిల్లీకి వెళ్తారు. 
 
25వ తేదీ నుండి రెండు, మూడురోజుల పాటు ఢిల్లీలోనే ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలుస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో సమావేశం అవుతారు. బీఎస్పీ అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతితో సమావేశం అవుతారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తోనూ సమావేశం అవుతారు. పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు.దీనిపై మరింత చదవండి :