శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2015 (09:58 IST)

టీ ఎంట్రీ ట్యాక్స్‌పై తెలంగాణ లారీ ఓనర్స్ అసంతృప్తి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చే వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్‌ను తెలంగాణ సర్కారు వసూలు చేయడాన్ని తెలంగాణ రాష్ట్రంలోని లారీ యజమానుల సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాష్ట్ర పన్నుల విధానంతో రూ.40 కోట్ల మేర నష్టపోయామని గుర్తు చేశారు. 
 
తాజాగా అంతరాష్ట్ర పన్ను వసూలుకు తెర తీయడం వల్ల మరింతగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆ సంఘం పేర్కొంటూ ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై విమర్శలు కురిపించింది. ఇప్పటికే పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని వర్గాల నుంచి విముఖత వ్యక్తమవుతుండగా, తాజాగా సొంత రాష్ట్రంలోని తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తం కావడం గమనార్హం. 
 
ఇదిలావుండగా, అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చిన అంతరాష్ట్ర పన్నుపై టీఎస్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. దీనిపై రేపు అత్యవసరంగా భేటీ కావాలని తీర్మానించింది. అంతేకాక అంతరాష్ట్ర పన్నుకు వ్యతిరేకంగా సాగించాల్సిన పోరుకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకోవాలని అసోసియేషన్ ప్రతినిధులు భావిస్తున్నారు.