మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR

తెలంగాణ రాష్ట్రంలో 24x7 విద్యుత్ సరఫరాకు కేంద్రం పచ్చజెండా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా 24 గంటల విద్యుత్ సరఫరాకానుంది. ఈ తరహా పథకానికి కేంద్ర విద్యుత్ శాఖ పచ్చజెండా ఊపింది. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే ఏపీకి 24 గంటల విద్యుత్‌ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. 
 
విద్యుత్‌ సరఫరా వ్యవస్థను మెరుగు పరిచేందుకు, ఆధునకీకరించేందుకు ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉండటంతో.. ఏపీలాగే తమకూ 24 గంటల విద్యుత్‌ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ సర్కార్‌ చాలాసార్లు కేంద్రాన్ని కోరింది. ఇందుకోసం అనేక దఫాలుగా చర్చలు జరిపింది. 
 
తాజాగా.. శుక్రవారం నాడు ఢిల్లీలో కేంద్ర విద్యుత్‌ శాఖలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో తెలంగాణ ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి ప్రజెంటేషన్‌ ఇచ్చారు. దీంతో స్వల్ప సవరణలతో ఈ ప్రతిపాదనకు కేంద్ర విద్యుత్‌ శాఖ దాదాపు పచ్చజెండా ఊపింది. 
 
ప్రతిపాదనలకు సూత్రపాయ ఆమోదం తర్వాత.. కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో ఈ పథకం అమలు అవగాహన పత్రంపై సంతకాలు జరిగే అవకాశముందని ఇంధన శాఖ వర్గాలు తెలిపాయి.