బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 22 సెప్టెంబరు 2014 (17:45 IST)

తెలంగాణ భారత్‌లో అంతర్భాగం : ఫాస్ట్ జీవోపై కేసీఆర్‌కు హైకోర్టులో చుక్కెదురు!

తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జారీ చేసిన 'ఫాస్ట్' జీవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ జీవో జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా ఉందని, అందువల్ల పునఃపరిశీలన చేయాలంటూ హైకోర్టు సూచన చేసింది. తెలంగాణ ప్రత్యేకంగా ఎక్కడో లేదని, భారతదేశంలోనే అంతర్భాగమని కోర్టు వ్యాఖ్యానించింది. 
 
కొన్ని రోజుల కిందట 'ఫాస్ట్' జీవోను సవాల్ చేస్తూ మాజీ మంత్రులు డొక్కా మాణిక్య వరప్రసాద్, పితాని సత్యనారాయణ హైకోర్టులో వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం, ఫాస్ట్ జీవో రాజ్యాంగపరంగా ఆమోదయోగ్యం కాదని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. 
 
మరోమారు ఈ విషయంపై పునఃపరిశీలించాలని కూడా చెప్పింది. ఈ క్రమంలో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఆరు వారాలకు తదుపరి విచారణ వాయిదా వేసింది. 1956 నవంబర్ 1 నాటికి తెలంగాణలో స్థిరపడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులకే ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించినదే ఈ 'ఫాస్ట్' జీవో.
 
కాగా, తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉదయమే హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకోగా, మధ్యాహ్నం ఫాస్ట్ జీవో వ్యవహారంపై మండిపడింది. ఇష్టమొచ్చినట్టు నంబర్ ప్లేట్లు మార్చుకోవాలని, రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించడం మీద హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేయగా... మధ్యాహ్నం ఫాస్ట్ జీవోపై హైకోర్టు తెలంగాణ ప్రభుత్వం మీద సీరియస్ అయింది. 
 
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు సంబంధించి జారీ చేసిన ‘ఫాస్ట్’ పథకం జీవోను హైకోర్టు తప్పు పట్టింది. తెలంగాణ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేయడం రాజ్యాంగపరంగా ఆమోదయోగ్యం కాదని తేల్చి చెప్పింది. జాతీయ సమగ్రతను దెబ్బతీసేలా ఈ జీవో ఉందని హైకోర్టు ఆగ్రహించింది. ఈ జీవో విషయంలో ప్రభుత్వం పునరాలోచించుకోవాలని హితవు పలికింది. తెలంగాణ ఎక్కడో ప్రత్యేకంగా లేదని, తెలంగాణ కూడా భారతదేశంలో అంతర్భాగమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.