గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : మంగళవారం, 24 నవంబరు 2015 (10:10 IST)

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై హైకోర్టు అసంతృప్తి

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం లబ్ధిదారుల ఎంపికపై హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేసింది. రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యే, ఆ జిల్లా మంత్రికి అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబట్టింది. 
 
బలహీనవర్గాలకు చెందిన వారికి కేటాయించనున్న రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి గత నెల 15న తెలంగాణ గృహ నిర్మాణశాఖ జారీచేసిన జీవోను సవాల్ చేస్తూ జేసుదాసు అనే వ్యక్తి హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారించిన న్యాయస్థానం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దిలీప్‌ బి బోస్లే, జస్టిస్‌ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం జీవోపై వ్యాఖ్యలు చేసింది. 
 
లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కమిటీకి అప్పగించకపోవడాన్ని తప్పుబట్టింది. మంత్రి, ఎమ్మెల్యేలు ప్రజల నుంచి ఏవిధంగా దరఖాస్తులు స్వీకరిస్తారని ప్రశ్నించింది. ఇలాంటి జీవోను ఏవిధంగా జారీచేస్తారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది మహేందర్‌ రెడ్డిని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో ప్రమాణ పత్రం దాఖలు చేయడానికి న్యాయవాది మహేందర్‌ రెడ్డికి నెలాఖరు వరకు గడువు ఇస్తూ.. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది.