శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 28 జనవరి 2015 (09:36 IST)

రాజయ్య తొలగింపు.. మాదిగ జాతిని అవమానించడమే : టీటీడీపీ

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్యను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం మాదిగ జాతిని అవమానించడమే అవుతుందని టీ టీడీపీ నేతలు మోత్కుపల్లి నర్సింహులు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపిస్తున్నారు. 
 
రాజయ్యను అవమానకర రీతిలో మంత్రివర్గ నుంచి బర్తరఫ్ చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఇందులోభాగంగా టీ టీడీపీ నేతలు మోత్కుపల్లి, ఎర్రబెల్లి దయాకర్ రావులు మాట్లాడుతూ.. రాజయ్యను మంత్రివర్గం నుంచి బహిష్కరించడానికి గల కారణాలను, ఒకవేళ ఆయన ఆవినీతికి పాల్పడి వుంటే ఆ వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
గతంలో అవినీతికి పాల్పడినందువల్లే కేసీఆర్‌ని చంద్రబాబు మంత్రివర్గం నుంచి తొలగించారని ఎర్రబెల్లి గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో ముగ్గురు తప్ప అంతా తెలంగాణ ద్రోహులేనంటూ ఎర్రబెల్లి మండిపడ్డారు. దళితుడే తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు దళితులను మోసం చేశారని ఆయన విమర్శించారు. 
 
అలాగే రాజయ్యను మంత్రివర్గం నుంచి బహిష్కరించడం ద్వారా కేసీఆర్ మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని మరో టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. కేసీఆర్కు తెలియకుండా హెల్త్ యూనివర్శిటీపై ప్రకటన చేసినందుకే రాజయ్యపై వేటు వేశారన్నారు.