శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 29 జూన్ 2015 (11:06 IST)

నిర్ణీతకాలంలో పరిశ్రమలు పెట్టకుంటే భూములు స్వాధీనం : టీ సర్కారు మెలిక

తమతమ రాష్ట్రాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు, కొత్తకొత్త పరిశ్రమలు స్థాపించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. ఇందులో ఏపీ కంటే తెలంగాణ రాష్ట్రం ఒక అడుగు ముందులోనే ఉంది. తమ రాష్ట్రానికి కొత్తగా వచ్చే పరిశ్రమలకు అనుమతుల మంజూరును కేవలం పదిపదిహేను రోజుల్లోనే మంజూరు చేసేలా కొత్త పారిశ్రామిక విధానాన్ని రూపొందించింది. ఇంతవరకు బాగానేవుంది. సర్కారు ప్రోత్సహాన్ని కూడా ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. 
 
అయితే, నిర్ణీత కాలవ్యవధిలో పరిశ్రమలు స్థాపించకపోతే, కేటాయించిన స్థలాలను కూడా లాగేసుకుంటామని కేసీఆర్ సర్కారు విస్పష్టంగా ప్రకటించింది. తాజాగా కొత్తగా అమల్లోకి రానున్న ఆ రాష్ట్ర ఇండస్ట్రియల్ పాలసీలో మరో మెలిక కూడా ఉందట. కొత్తగా పరిశ్రమలు పెట్టే పారిశ్రామికవేత్తలు తమ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభించిన తర్వాతే రాయితీల విషయంపై మాట్లాడాలని కోరిందట. 
 
ఒకవేళ రాయితీల కోసం ఆయా పారిశ్రామికవేత్తలు ముందుగానే దరఖాస్తు చేసుకున్నా, ఉత్పత్తి ప్రారంభమైన తర్వాతే వాటిని పరిశీలిస్తారించి రాయితీలు ఇస్తారట. అంటే నిర్ణీత గడువులోగా ప్లాంటు నిర్మాణాన్ని పూర్తి చేసిన పారిశ్రామికవేత్తలు ప్రభుత్వం నుంచి అందే రాయితీల కోసం మాత్రం కనీసం 3 నెలల నుంచి 6 నెలల దాకా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. ఈ తాజా మెలికపై పారిశ్రామికవర్గాల్లో అంతర్మథనం ప్రారంభమైనట్టు సమాచారం.