శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 15 సెప్టెంబరు 2014 (16:09 IST)

భారతరత్నకు పీవీ - ఎన్టీఆర్ పేర్లు... పద్మ విభూషణ్‌కు బాపు పేరు సిఫార్సు!

ప్రతి యేటా భారత ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పౌరపురస్కారమైన భారతరత్న అవార్డును మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహా రావు పేరును తెలంగాణ ప్రభుత్వం సిఫార్సు చేయనుంది. అలాగే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఎన్టీఆర్ పేరును ఈ అవార్డుకు సిఫార్సు చేయనుంది. మరోవైపు.. పద్మ విభూషణ్ అవార్డుకు ఇటీవల కన్నుమూసిన దర్శకుడు బాపు పేరును సిఫార్సు చేయనుంది. 
 
'భారతరత్న'ను మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుకు ఇవ్వాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. 'పద్మవిభూషణ్'కు ఆచార్య జయశంకర్, 'పద్మభూషణ్'కు ఆచార్య జి.రామిరెడ్డి పేర్లను ప్రభుత్వం సిఫార్సు చేస్తుందట. పద్మశ్రీ అవార్డుకు కూడా కొంతమంది పేర్లను పంపాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల్లో ఈ జాబితాపై సీఎం ఆమోద ముద్ర వేశాక కేంద్రానికి పంపనున్నారట.
 
అలాగే, ఇటీవల కన్నుమూసిన ప్రముఖ చిత్రకారుడు, సినీ దర్శకుడు బాపు పేరును 'పద్మ విభూషణ్' పురస్కారానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫార్సు చేయనుంది. రెండు రోజుల కిందట 'పద్మ' పురస్కారాలకు పేర్ల ప్రతిపాదనలపై సమావేశం నిర్వహించిన ప్రభుత్వం, జాబితా కోసం కొన్ని పేర్లను సిద్ధం చేసింది. 'పద్మ' పురస్కారాలకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పంపించనుంది.  
 
బాపుతో బాటు ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, విఖ్యాత గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ రాజ్ రెడ్డి పేర్లను 'పద్మవిభూషణ్'కు సిఫార్సు చేస్తోంది. అదేవిధంగా.. ఆధ్యాత్మిక ఉపన్యాసకులు చాగంటి కోటేశ్వరరావు, శాస్త్రీయ సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూరి, ప్రముఖ సినీనటులు, ఎంపీ మురళీమోహన్ పేర్లను 'పద్మభూషణ్' కోసం సిఫార్సు చేస్తుందట. ఇక 'పద్మశ్రీ' పురస్కారం జాబితాలో సినీ నటుడు కోట శ్రీనివాసరావు తదితర ప్రముఖుల పేర్లు ఉన్నాయి.