గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Eswar
Last Modified: గురువారం, 24 జులై 2014 (19:52 IST)

కెసీఆర్.. డౌన్..డౌన్ మాసాయిపేట రైల్వే గేటు వద్ద...

మెదక్ జిల్లాలో జరిగిన రైలు దుర్ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గురువారం ఉదయం తూప్రాన్‌లోని కాకతీయ విద్యాలయం బస్సు ఇస్లాంపూర్ నుండి విద్యార్థులను తీసుకెళుతోంది. వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద రైల్వే క్రాసింగ్ వద్ద రైలు ఢీకొనడంతో 22 మంది చిన్నారులు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో తండ్రి గుండెపోటుతో మృతి చెందాడు. మొత్తం 22 మంది కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
 
60 వేలు ఖర్చు అని
ఈ సంఘటనపై స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలుగా గేటు ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు స్పందించలేదని పేర్కొన్నారు. ఇక్కడ ఒక గదిని ఏర్పాటు చేశారని, కానీ నెలకు 60 వేల రూపాయలు ఖర్చు వస్తుందని భావించి ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయలేదని తెలిపారు. గదిని అలాగే వదిలేయడం వల్ల రైలు వస్తుందన్న సంగతి తెలియడం లేదని స్థానికులు తెలిపారు.
 
కేసీఆర్ డౌన్..డౌన్..
ఘటన జరిగిన తరువాత కూడా సీఎం ఇక్కడకు రాకపోవడం పట్ల స్థానికులు కన్నెర్ర చేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో ఆందోళన చేపట్టారు. సీఎం సొంత నియోజకవర్గంలో ప్రమాదం జరిగినా సీఎం ఇక్కడకు రాలేదని, వెంటనే ఇక్కడకు రావాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల రూపాయలివ్వాలని, అలాగే రైల్వే సంస్థలో ఉద్యోగం ఇవ్వాలని పేర్కొన్నారు. ఘటన జరిగిన తరువాత ఏదో ఎక్స్‌గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదని, వెంటనే ప్రైవేటు స్కూలు సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ప్రమాదంపై దర్యాప్తు చేయాలని కేసీఆర్ ఆదేశించారు.