శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శనివారం, 4 జులై 2015 (17:05 IST)

కోర్టు అనుమతితోనే యాసిన్ భత్కల్‌కు ల్యాండ్‌ఫోన్ సౌకర్యం : టీ జైళ్ల శాఖ డీఐజీ

ఇండియన్ ముజాహిదీన్ తీవ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది యాసిన్ భత్కల్‌ హైదరాబాద్ చర్లపల్లి జైలు నుంచి తప్పించుకుని పారిపోయేందుకు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.ఐ.ఏ) భగ్నం చేసింది. దీనిపై తెలంగాణ జైళ్ల శాఖ డీఐజీ నరసింహారెడ్డి స్పందించారు.
 
చర్లపల్లి జైల్లో కాయిన్ బాక్స్ ఫోన్ ఉన్నప్పటికీ.. యాసిన్ భత్కల్‌కు మాత్రం కోర్టు అనుమతితో ల్యాండ్‌లైన్‌ఫోన్ సౌకర్యం కల్పించినట్టు చెప్పారు. ఈ సౌకర్యం గత 2015 నుంచి ఉందని, వారంలో రెండుసార్లు ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. ల్యాండ్‌ఫోన్‌ ద్వారా భార్య జహీదా, తల్లి రెహనాతో భత్కల్ 25 కాల్స్‌ మాట్లాడారని, ఈ 25 సార్లు అరబిక్‌, ఉర్దూ భాషలో మాట్లాడినట్లు డీఐజీ తెలిపారు. నిబంధనల ప్రకారం మాట్లాడిన ప్రతి కాల్‌ను రికార్డు చేశామని వెల్లడించారు.
 
అలాగే, ములాఖత్‌లో భత్కల్‌ను లాయర్‌, భార్య, తల్లి కలుసుకున్నారన్నారు. జైలులో ఎస్టీడీ ఫోన్‌ చేసుకునే అవకాశం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. ఆడియో ఫుటేజ్‌ను ఎన్‌ఐఏ అధికారులు తీసుకెళ్లారని తెలిపారు. కాగా, చర్లపల్లి జైలులో 13 మంది ఐఎస్‌ఐ ఉగ్రవాదులు ఖైదీలుగా ఉన్నారని,  ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో జైలుకు అదనపు భద్రతను కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు.