శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Raju
Last Modified: హైదరాబాద్ , సోమవారం, 10 జులై 2017 (05:53 IST)

ఒక్క మదనపల్లిలో టమాటా పండకపోతే తెలంగాణ మొత్తం అల్లాడిపోతోంది. ఎన్నాళ్లీలా?

తెలంగాణలో టమాటా ధర ఇప్పుడు ప్రజలకు మంటెక్కిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. కిలో టమాటా హైదరాబాద్‌లో ఆదివారం నాడు వందరూపాయలు పలికిందంటే ఎవరైనా నమ్ముతారా నమ్మక తప్పదు. ప్రతిసారీ అదే మాట. అదే కారణం. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి ప్రాంతంలో టమాటా పండకపోతే, సక

తెలంగాణలో టమాటా ధర ఇప్పుడు ప్రజలకు మంటెక్కిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. కిలో టమాటా హైదరాబాద్‌లో ఆదివారం నాడు వందరూపాయలు పలికిందంటే ఎవరైనా నమ్ముతారా నమ్మక తప్పదు. ప్రతిసారీ అదే మాట. అదే కారణం. చిత్తూరు జిల్లాలోని మదనపల్లి ప్రాంతంలో టమాటా పండకపోతే, సకాలంలో పంట దిగుబడి రాకపోతే, తుఫాన్లు, బారీ వర్షాల వల్ల పంట పాడైపోతే తెలంగాణ మొత్తం అల్లాడిపోతోంది. ఎందుకంటే  మూడు రాష్ట్రాల నుంచి టమాటా పంటను తెలంగాణ రాష్ట్రం ఏటా దిగుమతి చేసుకుంటున్నప్పటికీ  దాంట్లో మదనపల్లి వాటా 85 శాతంగా ఉండటమే. 
 
ఏపీ, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల ప్రజల అవసరాలను ప్రతి ఏటా మదనపల్లి టమాటానే తీరుస్తోందంటే ఈ గుడ్డిప్రభుత్వాల పనితీరు, ప్లాన్ లెస్ పాలన ఏ దురవస్తలో కొట్టుమిట్టాడుతున్నాయో అర్థమవుతుంది.అదే మదనపల్లిలో గిట్టుబాటు ధరలేక కిలో అర్థరూపాయి కూడా వెలపలకక రైతులు తమ టమాటా దిగుబడిని రోడ్ల మీద పారేసి తమను తమను శపించుకుంటూ వెళతారు. కాని ఇప్పుడు కిలో వందరూపాయలు పలుకుతున్నప్పుడు కూడా దళారులకే అధిక భాగం దక్కుతోంది తప్పితే పండించే రైతులకు దక్కేది తక్కువే. 
 
నాలుగైదు దశాబ్దాలుగా రెండు తెలుగు రాష్ట్రాల టమాటా అవసరాలను మదనపల్లి టమాటానే తీరుస్తోందని ఇలా ధర పెరిగినప్పుడల్లా వార్తలు వస్తూనే ఉన్నాయి. కాని ఏ ప్రభుత్వాలూ మేలుకోవు. ఇతర ప్రాంతాల్లో పంటసాగుకు పథకాలేయవు. తమ ప్రాంత రైతులను ప్రోత్సహించవు. తెలంగాణను బంగారు తెలంగాణ చేసిపడేస్తామంటున్న పెద్దలు 600 కిలోమీటర్ల లోని మదనపల్లి నుంచి టమాటా రాకపోతే రాష్ట్రప్రజలు అల్లాడిపోతున్న దుస్తితి కనిపించడం లేదా.. కనిపించినా నిర్లక్ష్యం వహిస్తున్నారా? 
 
మదనపల్లికి తెలంగాణకు ఏం సంబంధం?
తెలంగాణలో వినియోగించే మొత్తం టమాటాలో రాష్ట్రంలో పండేది కేవలం 3 శాతం వరకే ఉంటుంది. దాదాపు 85 శాతం టమాటా ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి నుంచే సరఫరా అవుతుంది. ఆ తర్వాత కర్ణాటకలోని కోలారు, చింతమణి ప్రాంతాల నుంచి మరికొంత వస్తుంది. అయితే ఆయా ప్రాంతాల్లో దిగుబడి పడిపోవడం, భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతినడంతో రాష్ట్రానికి సరఫరా తగ్గిపోయింది. దీంతో టమాటా ధరలు అమాంతం ఎగబాకాయి. ఇక మహారాష్ట్ర, తమిళనాడుల్లో భారీ వర్షాల కారణంగా టమాటా పంట దెబ్బతిన్నది. 
 
దాంతో ఆయా రాష్ట్రాల వ్యాపారులు మదనపల్లి నుంచి టమాటాను దిగుమతి చేసుకుంటుండటంతో.. డిమాండ్‌ పెరిగి, తెలంగాణకు టమాటా సరఫరా తగ్గిపోయింది. అంతేకాదు మదనపల్లి పరిసర ప్రాంతాల్లోనూ టమాటా దిగుబడులు పడిపోయాయి. దీంతో మదనపల్లి హోల్‌సేల్‌ మార్కెట్లోనే ధరలు రెండు మూడు రోజుల్లో రెట్టింపయ్యాయి. ఈ నెల 6వ తేదీన మొదటి గ్రేడ్‌ టమాటా కిలో రూ.41 పలకగా.. ఏడో తేదీన రూ.60కి.. 8వ తేదీన రూ.72కు చేరింది. దీంతో స్థానికంగానే రిటైల్‌ వ్యాపారులు కిలో టమాటా రూ.80 నుంచి రూ.90 వరకు అమ్ముతుండటం గమనార్హం.
 
మార్కెట్లో దళారీ వ్యవస్థ వల్లే సీజన్‌లో టమాటా ధర బాగా తగ్గిపోవడం.. అన్‌సీజన్‌లో ధర బాగా పెరిగిపోవడం జరుగుతోందని మార్కెటింగ్‌ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలు టమాటా పంట వేసేందుకు సీజన్‌ కాదని... దాంతో ఏటా జూన్, జూలై నెలల్లో టమాటా ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్‌సీజన్‌లో టమాటా పండించేలా రైతులను సిద్ధం చేయడంలో వ్యవసాయ, ఉద్యానశాఖలు విఫలమవుతున్నాయని.. దానితో ధరలు పెరిగిపోతున్నాయని స్పష్టం చేస్తున్నాయి. 
 
పైగా తెలంగాణలో మూడు జిల్లాల్లో మాత్రమే టమాటాను పండిస్తున్నారని పంటసాగను విస్తరించే పథకాలే ప్రభుత్వం వద్ద లేదంటే బంగారు తెలంగాణకు సిగ్గు చేటు. ఆ పేరు మార్చుకుని టమాటాలు దొరకని తెలంగాణ అని పెట్టుకుంటే పోతుందేమో...