గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 25 జులై 2014 (17:07 IST)

అన్నా రైలొస్తోంది... విద్యార్థుల ఆర్తనాదాలు పట్టించుకోని బస్సు డ్రైవర్!!

అన్నా రైలొస్తోంది.. ఇటు చూడన్నా... రైలు వచ్చేసింది.. దగ్గరకు వచ్చేసింది.. చూడన్నా.. అని బస్సులోని విద్యార్థులంతా కేకలు వేస్తూ బిగ్గరగా అరుస్తున్నా ఆ బస్సు డ్రైవర్ మాత్రం ఏమాత్రం చెవికెక్కించుకోలేదు. తాను 38 మంది చిన్నారులు ఉన్న బస్సును నడుపుతున్నాననే విషయాన్ని పూర్తిగా మరచిపోయి.. మొబైల్ ఫోన్‌లో అవతలి వ్యక్తితో నవ్వుతూ.. నింపాదిగా మాట్లాడుతూ.. బస్సును నడుపుతూ వచ్చాడు. మాసాయిపేట - శ్రీనివాస్‌నగర్‌ రైల్వే క్రాసింగ్‌ వద్దకు వచ్చినప్పటికీ.. తన దృష్టిని డ్రైవింగ్‌పై మరల్చకుండా ఫోన్‌లో మాట్లాడటంపైనే దృష్టి కేంద్రీకరించాడు. ఫలితంగా 16 మంది చిన్నారులు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. అనేకమంది గాయాలబారిన పడ్డారు. నాలుగు గ్రామాల ప్రజలకు తీరని కడుపు శోకాన్ని మిగిల్చి, తాను కూడా మృత్యువు ఒడిలోకి జారుకున్నాడు కాకతీయ విద్యామందిర్ బస్సు డ్రైవర్. 
 
ఎప్పటిలానే దాతర్‌పల్లి, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయపల్లి, ఇస్లాంపూర్‌, కిష్టాపూర్‌ గ్రామాలకు చెందిన చిన్నారులు గురువారం ఉదయం స్కూల్‌ బస్సులో పాఠశాలకు ప్రయాణమయ్యారు. ఆయా గ్రామాల నుంచి చిన్నారులను తీసుకుని బస్సు తూప్రాన్‌కు బయలుదేరింది. ఈ క్రమంలో డ్రైవర్‌ భిక్షపతిగౌడ్‌ సెల్‌ఫోన్లో మాట్లాడుతూ స్కూల్‌ బస్సును నడుపుతున్నాడు. అంతలోనే మాసాయిపేట - శ్రీనివాస్‌నగర్‌ రైల్వే క్రాసింగ్‌ వద్దకు బస్సు చేరుకుంటుండడంతో అప్పుడే అటుగా వస్తున్న నాందేడ్‌ ప్యాసింజర్‌ను చిన్నారులు గుర్తించారు. 
 
ఈ విషయమై రైలు వస్తున్నట్టు చిన్నారులు కేకలు వేస్తూ.. పెద్దగా అరుస్తూ.. ఎంతగా మొత్తుకుంటున్నా డ్రైవర్‌ భిక్షపతి పట్టించుకోకుండా బస్సును ముందుకు తీసుకెళ్లాడు. అంతే... నాందేడ్‌ ప్యాసింజర్‌ బస్సును ఢీకొట్టింది. రైలు బస్సును సుమారు నాలుగైదు ఫర్లాంగుల దూరం లాక్కెళ్లింది. దీంతో స్కూలు బస్సు నుజ్జనుజ్జయింది. బస్సులో ఉన్న చిన్నారుల్లో అక్కడికక్కడే 13 మంది మృతి చెందారు. మరో 18మందికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారుల ఆర్తనాదాలకైనా ఆ డ్రైవర్ మేల్కొనివున్నట్టయితే ఈ ఘోర ప్రమాదం నుంచి తప్పించి వుండొచ్చని స్థానికులు చెపుతున్నారు.