శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (14:55 IST)

జీహెచ్ఎంసీలో అవినీతి రహిత పాలనే లక్ష్యం : మేయర్‌ రామ్మోహన్‌

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థలో అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకెళ్తామని జీహెచ్‌ఎంసీ మేయర్‌ రామ్మోహన్‌ స్పష్టంచేశారు. ఆయన శుక్రవారం మేయర్ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... హైదరాబాద్‌ అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి పలువురు నగరవాసులు విలువైన సూచనలు, సలహాలు అందించారు. వీటితో హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయనున్నట్లు చెప్పారు. 
 
హైదరాబాద్‌ ఉపాధి కేంద్రంగా మారడంతో అన్ని జిల్లాల నుంచి ప్రజలు వస్తున్నారనీ, వీరంతా నగరాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. తాను వూహించని పదవి దక్కడం పట్ల చాలా సంతోషంగా ఉందన్నారు. తనపై నమ్మకంతో మేయర్‌ పదవి అప్పగించిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటూ.. జీవితాంతం ఆయనకు రుణపడివుంటానన్నారు. కేసీఆర్‌ మా పార్టీ అధ్యక్షుడే కాదు... మార్గనిర్దేశకుడిగానూ ఉంటారని తెలిపారు. 
 
ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి ప్రణాళికా బద్దంగా కృషి చేయనున్నట్లు చెప్పారు. జనాభాకు అనుగుణంగా ట్రాఫిక్‌లో మార్పులు చేస్తామన్నారు. హైదరాబాద్‌లో మరిన్ని సులభ్‌ కాంప్లెక్స్‌లు ప్రారంభిస్తామన్నారు. అన్ని శాఖల మధ్య సమన్వయ లోపం లేకుండా చేస్తే సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందన్నారు. కొత్తగా ఎన్నికైన 150 మంది కార్పొరేటర్లలో ఎక్కువ మంది యువకులే ఉన్నారని, విశ్వనగరం ఏర్పాటుకు యువ కార్పొరేటర్ల సహకారం తీసుకుంటామని రామ్మోహన్ వెల్లడించారు.