గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR

ఏయ్.. జేసీ.. నేను చెప్పిన స్థలానికి పట్టా ఇవ్వు : తెరాస ఎమ్మెల్యే బెదిరింపులు!

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు చెందిన ప్రజా ప్రతినిధుల నుంచి వేధిపులు, హెచ్చరికలు మరింత ఎక్కువై పోతున్నాయి. వ్యవసాయ యాంత్రీకరణ కింద సబ్సీడీ ట్రాక్టర్లను టీఆర్ఎస్ కార్యకర్తలకు చేరిపోతున్నాయన్న ఆరోపణలతో సదరు పథకం అమలుపై జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ తాత్కాలిక నిషేధం విధించారు.
 
ఈ సంఘటన మరువక ముందే ఇదే జిల్లాకు చెందిన జాయింట్ కలెక్టర్‌పై తెరాస ఎమ్మెల్యే తన అధికార దర్పాన్ని ప్రదర్శించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లోకి చొచ్చుకువచ్చిన జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌పై బెదిరింపులకు దిగారు. ‘నేను చెప్పినట్లు చేయాల్సిందే. లేదంటూ నీ సంగతి చూస్తా. శిఖం భూమికి పట్టా ఇస్తావా?... లేదా?. నేను చెబితే కూడా ఫైల్ పక్కనబెట్టావ్. ఒక్కసారి చెబితే అర్థం కాదా?’ అంటూ ఎమ్మెల్యే యాదగిరి, జేసీపై విరుచుకుపడ్డారు. 
 
రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. జేసీపై ఆగ్రహంతో ఊగిపోయిన ఆయన, అక్కడికి చేరుతున్న ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో చిన్నగా జారుకున్నారు. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు భగ్గుమన్నారు. ఉద్యమంలో ఒక్క టీఆర్ఎస్ మాత్రమే పాల్గొందా?, తాము లేకుంటే పరిస్థితి ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నానాటికీ పెరిగిపోతున్న టీఆర్ఎస్ నేతల బెదిరింపులను నిలువరించాల్సిందేనని వారు తీర్మానించారు.