బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (15:29 IST)

కేసీఆర్ లాగానే ఈటెల కూడా సన్నగా ఉంటారు.. సన్నబియ్యం అందుకే?

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు లాగానే ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కూడా సన్నగా ఉంటారని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కాంగ్రెస్, టీడీపీలపై విమర్శలు గుప్పించారు. పనిలో పనిగా సన్నబియ్యంపై క్లారిటీ ఇచ్చారు.

తెలంగాణ రాష్ట్రంలో హాస్టళ్లకు సన్నబియ్యం అందించిన ఘనత ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌దేనని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. గత ప్రభుత్వాలు హాస్టళ్లకు దొడ్డు బియ్యం ఇచ్చాయని, ఆ దుస్థితి చూడలేకు తమ ప్రభుత్వం వచ్చాక సన్నబియ్యం పెడుతుందని ఉద్ఘాటించారు.
 
ఓ రోజు ఈటెల తన వద్దకు వచ్చి హాస్టళ్లకు సన్న బియ్యం ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారని, తాను వెంటనే ఒకే చెప్పానన్నారు. తక్షణమే దానికి సంబంధించి ఈటెల జీవో జారీ చేసినట్లు పార్టీ ప్లీనరీ సమావేశంలో వివరించారు. తాను, ఈటెల ఇద్దరమూ సన్నగానే ఉంటామని అందుకే హాస్టళ్లకు కూడా సన్నబియ్యం ఇస్తున్నామన్నారు.
 
తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది టీఆర్ఎస్ కార్యకర్తలేనని కేసీఆర్ అన్నారు. వారి త్యాగఫలితమే నేటి తెలంగాణ అని చెప్పారు. కార్యకర్తలు ఏనాడు వెనకడుగు వేయలేదని, జెండా కింద పెట్టకుండా విజయం సాధించేదాకా ప్రయాణం చేశారని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా పోరాడిన ఘనత వారిదేనని ప్రశంసించారు.  అమరవీరుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని, తెలంగాణ సంస్కృతికి పునర్ వైభవం తెచ్చే ప్రక్రియ కొనసాగుతోందని కేసీఆర్ చెప్పారు.
 
ప్రపంచం అబ్బురపడేలా రూ.5 కోట్లతో కొమురం భీమ్ విగ్రహ నిర్మాణం జరుగుతోందని ప్రకటించారు. పీవీ నరసింహారావు జాతి గర్వించదగ్గ నేత అని, ఆయన జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. యాదగిరిగుట్టను దివ్యక్షేత్రంగా తిర్చిదిద్దుతున్నామని, కుంభమేళాను తలపించేలా గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.