గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2015 (12:23 IST)

తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఇతరులను సీఎం చేయడానికా? : నాయిని

ప్రాణాలను ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది ఇతరులను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టడానికా అంటూ ఆ రాష్ట్ర తొలి హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెరాస అధినేత కేసీఆర్ పలు బహిరంగ సభ వేదికల్లో ప్రకటించారు. ఈ మాటను కేసీఆర్ తప్పారంటూ విపక్షాలు మండిపడుతుంటే, తాజాగా నాయిని చేసిన వ్యాఖ్యలు దానికి ఆజ్యం పోసినట్లైంది. 
 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నది వేరెవరినో సీఎం చేయడానికి కాదన్నారు. అంతేకాక ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నది ఎవరినో మంత్రిగా చేయడానికి కూడా కాదని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తద్వారా అధికార కాంక్షను ఆయన బయటపెట్టుకున్నారు. 
 
మరోవైపు.. టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయని, దాదాపు 50 వేల మంది ప్రతినిధులు హాజరవ్వనున్నారన్నారు. ప్లీనరీ సన్నాహాల్లో భాగంగా.. నాయిని పార్కింగ్‌ కమిటీ ఛైర్మన్‌ బాధ్యతలు చూస్తున్నారు. ‘కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌ జిల్లాల నుంచి దాదాపు 1500 వాహనాలు వస్తున్నాయి. వాటి కోసం ఎన్టీఆర్‌ స్టేడియం వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేశామన్నారు. 
 
నల్లగొండ, ఖమ్మం నుంచి 1100 వాహనాలను ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌కు మళ్లిస్తాం. మెదక్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌ జిల్లాల నుంచి వచ్చే 3250 వాహనాల కోసం నెక్లెస్‌రోడ్‌, మక్తా, సంజీవయ్య పార్క్‌ల వద్ద పార్కింగ్‌ ఏర్పాటు చేశాం. వీఐపీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలుపుకొని మొత్తం 100వాహనాల కోసం పబ్లిక్‌ గార్డెన్స్‌లో పార్కు చేస్తాం. మంత్రులు, ఇతర విఐపీలవి 50 వాహనాలను టెన్నిస్‌ కోర్టు, కమిషనర్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ఆవరణకు తరలిస్తామని ఆయన వివరించారు.