శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (10:25 IST)

కన్నీటితో టీడీపీని వీడిన మాజీ మంత్రి తుమ్మల : 5న తెరాసలోకి...

ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కన్నీరు పెట్టుకుంటూ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన సెప్టెంబర్ 5వ తేదీన తెరాస తీర్థం పుచ్చుకోనున్నారు. తుమ్మల నాగేశ్వర రావుతో పాటు ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వర రావు, డీసీసీబీ, డీసీఎంఎస్‌ ఛైర్మన్లు మువ్వా విజయ్‌ బాబు, ఎగ్గడి అంజయ్య తదితరులు తమ రాజీనామా పత్రాలపై సంతకాలు చేశారు. తుమ్మల ప్రకటన నేపథ్యంలో జిల్లాలోని మండల గ్రామ స్థాయి నేతలు, ప్రజా ప్రతినిధులు టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో టీడీపీ తీవ్ర సంక్షోభంలో పడింది. 
 
‘నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను. ఆమోదించగలరు.’ అంటూ పార్టీ అధినేత చంద్రబాబుకు ఏకవాక్య ప్రస్తావనతో తుమ్మల రాజీనామా లేఖ పంపారు. వచ్చే నెల 5న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం రాత్రి టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌తో సమావేశమైన తుమ్మల హైదరాబాద్‌ నుంచి శనివారం ఉదయం ఖమ్మం చేరుకున్నారు. తన క్యాంప్‌ కార్యాలయంలో జిల్లాకు చెందిన ముఖ్యనాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించారు. ముఖ్య నేతలు, కార్యకర్తలంతా పార్టీ వీడడానికే మద్దతు పలకడంతో వెంటనే ఆయన రాజీనామా ప్రకటన చేశారు.  
 
ఇదీ తుమ్మల రాజకీయ నేపథ్యం.. .
టీడీపీ ఆవిర్భావం నుంచీ తుమ్మల పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. 1982లో ఎన్టీఆర్‌ సమక్షంలో టీడీపీలో చేరిన తుమ్మల, 1983 ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయారు. 1985లో మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు ప్రసాదరావుపై సత్తుపల్లిలో గెలిచి ‘జలగం కోట’పైనే పచ్చజెండా ఎగురవేశారు. ఎన్టీఆర్‌ కేబినేట్‌లో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసిన తుమ్మల, 1994లో అదే స్థానం నుంచి గెలిచారు. పార్టీ సంక్షోభ సమయంలో చంద్రబాబుకు అండగా నిలిచారన్న పేరుంది. చంద్రబాబు కేబినెట్‌లో ఎక్సైజ్‌, భారీ నీటిపారుదల, రోడ్లు భవనాల శాఖల మంత్రిగా పనిచేశారు. కమ్యూనిస్టుల ఖిల్లాగా ఉన్న జిల్లాను టీడీపీకి కంచుకోటగా మలిచారు. మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న గిరిజన గ్రామాల్లోనూ పసుపు జెండాను రెపరెపలాడించారు. దీంతో రాష్ట్రంలో టీడీపీకి బలంగా ఉన్న జిల్లాల్లో ఖమ్మం కూడా ఒకటిగా నిలిచింది. 
 
ఈ క్రమంలో మధుకాన్‌ సంస్థల అధినేత నామా నాగేశ్వరరావు జిల్లా రాజకీయాల్లోకి ప్రవేశించడంతో తుమ్మలకు ఎదురుగాలి వీయడం ప్రారంభమైంది. ఈ క్రమంలో చంద్రబాబు, తుమ్మల మధ్య దూరం పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో తుమ్మలతో పాటు ఆయన వర్గానికి చెందిన ఎమ్మెల్సీ బాలసానికి టికెట్‌ కేటాయింపులో పార్టీ అధిష్టానం వ్యవహరించిన తీరుతో పార్టీ జిల్లా శాఖలో విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఫలితంగా ఒక్క సత్తుపల్లి స్థానంతోనే టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జిల్లా రాజకీయ పరిస్థితులను అంచనా వేసిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తుమ్మలను పార్టీలోకి ఆహ్వా నించారు ప్రభుత్వంలోనూ గుర్తింపు ఇస్తామని తుమ్మలకు భరోసా ఇవ్వడంతో ఆయన టీడీపీకీ రాజీనామా చేశారు.