శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : సోమవారం, 29 సెప్టెంబరు 2014 (10:29 IST)

వైఎస్ జీవించి ఉంటే జయలలితకు పట్టిన గతే : వి హనుమంతరావు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి బతికే ఉండివున్నట్టయితే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు పట్టిన గతే పట్టివుండేదని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంత రావు జోస్యం చెప్పారు. అవినీతి అక్రమాలకు పాల్పడే రాజకీయ నేతలకు జయలలిత అక్రమాస్తుల సంపాదన కేసు ఓ కనువిప్పు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
జయలలిత కేసు తీర్పుపై వీహెచ్ మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి బతికుంటే జయలలితకు పట్టిన గతే పట్టేదేమోనని సందేహం వెలిబుచ్చారు. జగన్ అవినీతి ఆరోపణల కేసులో జగన్ మోహన్ రెడ్డిని మాత్రమే విచారిస్తున్నారని... వైఎస్ ఆత్మ కేవీపీపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. 
 
ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా లేక ఏ రాజకీయ నేత అయినా జయలలిత తీర్పు తర్వాత ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయాలని హితవు పలికారు. టీఎస్ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి ఉద్దేశ్యపూర్వకంగానే టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాలను టార్గెట్ చేశారని... మిగిలిన నేతలను ఎందుకు వదిలేశారని ప్రశ్నించారు.