శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (14:39 IST)

ఏం వెలగబెట్టాడని కేసీఆర్‌ భద్రతకు రూ.5 కోట్ల బస్సు : వీహెచ్ విసుర్లు

తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు భద్రత కోసం రూ.5 కోట్ల విలువ చేసే బుల్లెట్ ప్రూఫ్ బస్సును సిద్ధం చేయడంతో టీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. ‘ఏం వెలగబెట్టారని కేసీఆర్‌కు ముప్పు పొంచి ఉంది? ఎవరి నుంచి ముప్పు పొంచి ఉంది? అసలెందుకీ అత్యాధునిక బస్సు? అంత ఖర్చు పెట్టి ఈ బస్సు కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమిటీ?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
 
ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడిన తమ పార్టీ సీనియర్ నేత డి శ్రీనివాస్‌పై కూడా ఆయన మాటలదాడి చేశారు. పార్టీకి రాజీనామా చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను అందరూ ఛీ అంటున్నారన్నారు. డీఎస్‌ అవకాశవాది అని ఆయన ఆరోపించారు. డీఎస్‌ పార్టీ నుంచి వెళ్లినంత మాత్రాన నష్టమేమీలేదన్నారు. తమ పార్టీకి పెద్ద పీడ పోయిందనుకుంటున్నామన్నారు. 
 
ఇదిలావుండగా, కేసీఆర్‌ కోసం తయారు చేసిన బస్సు అత్యాధునిక సౌకర్యాలను కలిగివుంది. ఈ బస్సును చండీగఢ్‌లోని జేసీబీఎల్‌ కంపెనీకి ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇచ్చి తయారు చేయించారు. మెర్సిడెజ్‌‌ బెంజ్‌ కంపెనీకి చెందిన ఈ వాహనాన్ని బుల్లెట్‌ ప్రూఫ్‌గా మార్చారు. పేలుళ్లతో సహా దాడులనైనా తట్టుకోగల సత్తా దీనిసొంతం. ఈ బస్సులోనే పడకగది, బాత్‌రూమ్‌, చిన్నపాటి సమావేశమందిరం ఉంటాయి. ఈ బస్సును గురువారం హైదరాబాద్‌కు తరలించగా, టీఎస్ ఆర్టీసీ తుది మెరుగులు దిద్దుతోంది.