బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : ఆదివారం, 9 జులై 2017 (12:23 IST)

రాత్రి ఆలస్యంగా వస్తున్నాడనీ.. తనతో చనువుగా ఉండటం లేదనీ...

ఓ భార్య కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయించింది. దీనికి కారణం వింటే ప్రతి ఒక్కరికీ నవ్వు తెప్పిస్తుంది. మునుపటిలా తనతో చనువుగా, ప్రేమానురాగాలు ప్రదర్శించడం లేదనీ, రాత్రిపూటి ఆలస్యంగా ఇంటికి వస్తుండటంతో

ఓ భార్య కట్టుకున్న భర్తనే కిడ్నాప్ చేయించింది. దీనికి కారణం వింటే ప్రతి ఒక్కరికీ నవ్వు తెప్పిస్తుంది. మునుపటిలా తనతో చనువుగా, ప్రేమానురాగాలు ప్రదర్శించడం లేదనీ, రాత్రిపూటి ఆలస్యంగా ఇంటికి వస్తుండటంతో మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడనీ అనుమానంచింది. దీనిపై నిజానిజాలు తెలుసుకునేందుకు భర్తను కిడ్నాప్ చేయించింది. చివరకు కటకటాలపాలైంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హైదరాబాద్‌ బల్కంపేటకు చెందిన భానుప్రసాద్‌, ప్రసన్న కుమారి అనే దంపతులు ఉన్నారు. భానుప్రసాద్‌ ప్లాస్టిక్‌ పైపుల వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా రోజూ ఇంటికి ఆలస్యంగా రాసాగాడు. రోజువారీ బాధ్యతల తాలూకు ఒత్తిళ్లతో భార్యతో ఆయన మునుపటిలా సాన్నిహిత్యంగా ఉండటం లేదు. 
 
పైగా, వ్యాపార నిమిత్తం బంధువుల వద్ద రూ.10 లక్షలు అప్పు చేశాడు. ఈ పరిణామాలతో ఖచ్చితంగా వేరే కాపురం పెట్టే ఉంటాడన్న ఓ నిర్ణయానికి వచ్చిన ప్రసన్న... తమ ఇంట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తితో కలిసి కిడ్నాప్‌ ప్లాన్‌ వేసింది. ఇందుకు మరో ఇద్దరి సాయాన్ని కూడా తీసుకుంది. 
 
ఈనేపథ్యంలో గత నెల 28న ఎల్లమ్మ ఆలయంలో దర్శనం చేసుకొని బయటకొస్తున్న భానుప్రసాద్‌ను ప్రవీణ్‌, విశాల్‌ కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత మూడు రోజుల పాటు ఓ ఇంట్లో నిర్బంధించి... ప్రతిరోజూ ఇంటికి ఆలస్యంగా రావడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరితోనైనా వివాహేతర సంబంధం ఉందా? నిలదీశారు. ఈ ప్రశ్నలన్నింటికీ భానుప్రసాద్‌ ఇచ్చిన సమాధానాలను ప్రసన్నకు చేరవేశారు. ఆ తర్వాత ఆమె సూచన మేరకు భానుప్రసాద్‌ను విడిచిపెట్టారు. 
 
అయితే, ఈ నెల 1న ఇంటికి చేరుకున్న భానుప్రసాద్‌ ఘటనపై భార్యను ప్రశ్నించాడు. ఆమె పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో శుక్రవారం ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అసలు విషయం వెల్లడైంది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు కిడ్నాపర్లతో పాటు.. ప్రసన్నను అరెస్ట్‌ చేశారు.