శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: శనివారం, 25 అక్టోబరు 2014 (12:22 IST)

నీ ప్రకాశం బ్యారేజీ వద్దకు వస్తా... చంద్రబాబుకు కేసీఆర్ సవాల్

శ్రీశైలం విద్యుదుత్పత్తి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిది దొంగచూపు అని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అన్నారు. చంద్రబాబు వైఖరిపై అవసరమయితే సుప్రీం కోర్టుకు వెళ్తామని, కరెంటు విషయంలో చంద్రబాబు పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేస్తున్నారని, అహంకార ధోరణిలో మాట్లాడుతున్నారని కేసీఆర్ అన్నారు. 
 
శుక్రవారం రాత్రి కెసిఆర్ మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం విషయంలో చంద్రబాబును విడిచిపెట్టేది లేదని, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని చంద్రబాబు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని, ఆ కాగితాలతో చంద్రబాబు వచ్చినా సరే లేదంటే నేనే ప్రకాశం బ్యారేజీ వద్దకు వస్తానని సవాల్ విసిరారు. బహిరంగ చర్చ పెడితే ఎవరిది అసత్య ప్రచారమో తేలిపోతుందన్నారు.
 
ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్తులో కోత విధిస్తున్నారని కేసీఆర్ అన్నారు. కృష్ణపట్నం ప్లాంట్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరా చేయమని చంద్రబాబు అంటున్నారని... అదేమైనా ఆయన బాబు జాగీరా? అంటూ మండిపడ్డారు. అది రెండు రాష్ట్రాల జాయింట్ వెంచర్ అని చెప్పారు.
 
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. కరెంటు విషయంలో చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలే అని చెప్పారు. కరెంట్ విషయంపై సుప్రీంకోర్టుకు వెళతామని... సంగతేందో చూస్తామని చెప్పారు.