బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (14:47 IST)

స్వైన్ ఫ్లూ : తెలంగాణ రాష్ట్రంలో మృతుల సంఖ్య 23

స్వైన్ ఫ్లూ వైరస్ ధాటికి తెలంగాణా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. దీంతో ఈ రాష్ట్రంలో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. మంగళవారం నాటికి రాష్ట్రంలో మృత్యువాతపడిన వారి సంఖ్య 23కు చేరింది. ఈ వైరస్ లక్షణాలతో బాధపడుతూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో మంగళవారం ఉదయం మరో మహిళ ప్రాణాలు విడిచింది.
 
రంగారెడ్డి జిల్లా ఘట్ కేసర్ మండలం ఏదులాబాద్‌కు చెందిన వివాహిత శైలజ మంగళవారం ఉదయం చనిపోయింది. స్వైన్ ఫ్లూ బారినపడిన ఆమెను కుటుంబసభ్యులు హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. శైలజ మరణంతో రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ మరణాలు 23కు చేరుకున్నాయి. 
 
మరోవైపు.. తెలంగాణ రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ బారిన పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ఇప్పటి వరకు స్వైన్ ఫ్లూ లక్షణాలతో 1050 మందికి పరీక్షలు చేయగా, వారిలో 366 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ అని తేలింది. ఇదిలా ఉండగా సోమవారం ఒక్క రోజునే 52 మందికి స్వైన్ ఫ్లూ పాజిటివ్ సోకినట్లు తెలిసింది. వారిలో ఐదుగురు వైద్యులు కూడా ఉన్నట్లు సమాచారం.