శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Selvi
Last Updated : బుధవారం, 25 నవంబరు 2015 (14:08 IST)

పరువు పోగొట్టుకున్న జగన్: వరంగల్ ఎన్నికల్లో ఓట్లు చీల్చిన సీనే లేదు..!

వరంగల్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తీవ్ర పరాభవం ఎదురైంది. వైకాపా చీఫ్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే రంగం మీదికొచ్చాడని అనవసరంగా తెలుగుదేశం-బీజేపీ కూటమి ఆడిపోసుకుంది గానీ జగన్‌కు అంత సీన్ లేదని జగన్ సునాయాసంగా ఉపఎన్నిక ద్వారా ప్రదర్శించేసుకున్నారు.
 
వరంగల్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రజలు ఓటేసిన సంగతి తెలిసిందే. ఓట్లను చీల్చే విషయాన్ని పక్కనబెట్టేస్తే.., వరంగల్ ఉప ఎన్నిక ద్వారా ఉన్న పరువును కాస్త జగన్ పార్టీ పోగొట్టుకుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒక స్వతంత్ర పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కూడా దక్కించుకోలేని పార్టీగా వైకాపా ఘోరంగా తన్ను తాను దెబ్బతీసుకుంది. టీఆరెస్, కాంగ్రెస్, బీజేపీ-టీడీపీ కూటమిలను ఎలాగూ బీట్ చేయలేదని అనుకున్నారు. కానీ నాలుగో స్థానాన్ని కూడా శ్రమజీవి పార్టీ అనే అనామక పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థికి అప్పగించేసి అచ్చంగా అయిదో స్థానంలోకి పడిపోయిన వైకాపా ఇక ఏం ముఖం పెట్టుకుని తెరాసకు కాపు కాచే ప్రయత్నాలు చేపడుతుందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి.
 
తెరాసకు 6 లక్షలపైగా ఓట్లు, కాంగ్రెస్‌ పార్టీకి, బీజేపీ-తెదేపా కూటమికి చెరొక లక్షన్నర పైగా ఓట్లు నమోదైన చోట శ్రమజీవి పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లకన్నా (28,540) తక్కువగా వైకాపా 23,352 ఓట్లు సాధించి పేరు చెడగొట్టేసుకుంది. తన అభ్యర్థి గెలుపుమీద సందేహం లేనప్పటికీ ఎందుకైనా మంచిదని చివర్లో వైకాపా తరపున అభ్యర్థిని పోటీలో నిలపడంలో కేసీఆర్ సఫలం అయ్యారు.

కానీ ఇంత చెత్త ఫలితాలను వైకాపా సాధిస్తుందని తెరాస కలలో కూడా అనుకోలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇక జగన్‌తో పని వుండదని తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. తద్వారా తెలంగాణలో వైకాపా కూడా కనుమరుగైనట్టేనని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు.