జె.డి. చక్రవర్తి దర్శకత్వంలో 'మనీ మనీ మోర్ మనీ'

SELVI.M|
FILE
న్యూ జనరేషన్ కామెడీ చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన చిత్రం "మనీ". సెన్సేషనల్ డైరక్టర్ రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ఈ చిత్రం సన్నివేశాల పరంగాను, సంగీత పరంగాను, చిత్రీకరణ పరంగానూ, పాత్రల రూపకల్పన పరంగాను కొత్త పుంతలు తొక్కింది.

'మనీ' అనగానే అందరికీ మొదట 'ఖాన్‌దాదా' గుర్తుకొస్తాడు. ఈ పాత్ర బ్రహ్మానందానికి సూపర్‌స్టార్‌ని చేసింది. "ఖాన్‌తో గేమ్స్ ఆడొద్దు.., శాల్తీలు గల్లంతైపోతాయ్..!" అంటూ బ్రహ్మానందం చెప్పే ఊతపదం ఇప్పటికీ పాపులరే. అలాగే జె.డి.చక్రవర్తికి హీరోగా తొలి బ్రేక్‌ను ఇచ్చిన చిత్రమిది.

"వారెవా ఏమి ఫేసు", భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ.., చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి..," మొదలైన సూపర్‌హిట్ పాటలు ఇందులో ఉన్నాయి. 'మనీ' ఘనవిజయం సాధించడంతో రామ్‌గోపాల్ వర్మ 'మనీ మనీ' పేరుతో దానికి సీక్వెల్ చేశారు.

తాజాగా 'మనీ'కి పార్ట్ త్రీ రాబోతోంది. 'మనీ మనీ మోర్ మనీ' పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి రామ్‌గోపాల్‌వర్మ ప్రియ శిష్యుడైన జె.డి.చక్రవర్తి దర్శకత్వం వహించబోతున్నారు. 'ఖాన్‌దాదా'గా బ్రహ్మానందం ముఖ్యపాత్ర పోషించబోతున్నారు.

'అనంతరంపురం', 'సర్వం' వంటి అనువాద చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సింహపురి టాకీస్ అధినేతలు రఘునాథ్, నరేందర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ఒకప్పుడు సంచలనం సృష్టించిన 'మనీ'కి పార్ట్ త్రీ చేసే అవకాశం రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగులో ఇలా ఒక చిత్రానికి పార్ట్ త్రీ చేయడం అనేది ఇదే మొట్టమొదటి సారి. 'మనీ మనీ'కి ఇది కచ్చితమైన సీక్వెల్. 'హోమం', 'సిద్ధం'తో మాస్, యాక్షన్ చిత్రాలు బాగా డీల్ చేస్తాడని పేరు తెచ్చుకున్న జె.డి. 'మనీ మనీ మోర్ మనీ'తో కామెడీ కూడా బాగా తీయగలనని నిరూపించుకుంటారు. ఆగస్టు మూడో వారంలో చిత్రీకరణ మొదలుపెడతాం" అని తెలిపారు. ఇంకా ఈ చిత్రానికి కెమెరా: భరణి. కె. ధరన్, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: జె.డి. చక్రవర్తి.


దీనిపై మరింత చదవండి :