రామ్ "కందిరీగ" సీక్వెల్‌ ప్రారంభమైంది

వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT| Last Modified గురువారం, 12 ఏప్రియల్ 2012 (15:44 IST)
WD
రామ్‌ కథానాయకుడిగా సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్‌ నిర్మించిన 'కందిరీగ' సక్సెస్‌ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో సీక్వెల్‌ రాబోతుంది. సినిమాకు ఇంకా టైటిల్‌ పెట్టకపోయినా... పార్ట్‌-2 తీస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆర్య తర్వాత ఆర్య-2 వచ్చినట్లుగా ఈ చిత్రముంటుందని తెలిసింది. అయితే పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్‌ చిత్రమని దర్శకుడు చెబుతున్నాడు.

రామానాయుడు స్టూడియోలో గురువారం షూటింగ్‌ ప్రారంభమైంది. దేవుని పటాలకు రామ్‌ నమస్కరిస్తుండగా తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. దీనికి స్రవంతి రవికిషోర్‌ క్లాప్‌ కొట్టగా, బి.గోపాల్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. వినాయక్‌ ఫస్ట్‌షాట్‌కు దర్శకత్వం వహించారు.

దర్శకుడు మాట్లాడుతూ, కందిరీగ కంటే డబుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. స్క్రిప్ట్‌ అంతా చాలా బాగా వచ్చింది. కందిరీగ సీక్వెల్‌ అనేది అవునా? కాదా? అనేది చూసి చెప్పాలని అన్నారు.

రామ్‌ మాట్లాడుతూ, కందిరీగ తర్వాత ఇంత త్వరగా అదే కాంబినేషన్‌లో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. కందిరీగ కన్నా కూడా ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువగా ఉంటుంది అన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్‌ మాట్లాడుతూ, మే నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. కందిరీగ కంటే స్క్రిప్ట్‌ బాగా వచ్చింది. యాక్షన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌కు మంచి స్కోప్‌ ఉన్న సినిమాగా పేరు వస్తుంది. హీరోయిన్‌ పేరు త్వరలో వెల్లడిస్తాం అన్నారు.


దీనిపై మరింత చదవండి :