గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (09:49 IST)

బాపు 'సుందరకాండ' చాలా అనుభూతుల్ని మిగిల్చింది : ఛార్మి

బాపు కావ్యం "సుందరకాండ" చిత్రం తనకు చాలా అనుభూతులను మిగిల్చిందని నటి ఛార్మి అన్నారు. బాపు మరణంతో ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఆమె నెమరు వేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాపు గారిని తాను మొదటిసారి కలిసింది హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనని చెప్పింది. 'మా అమ్మా నాన్నలతో నేను చెన్నై వెళుతుండగా, బాపుగారు ఎయిర్‌పోర్ట్‌లో తారసపడ్డారు. ఆయనను చూడగానే, దగ్గరికెళ్లి పలుకరించాను. తర్వాత 10ది రోజులకి ఆయన ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. ‘బాపుగారు ‘సుందరకాండ’ సినిమా తీయనున్నారు. మిమ్మల్ని హీరోయిన్‌గా అనుకుంటున్నారు’ అని. దీంతో ఉద్వేగం ఆపుకోలేక బాపుగారిని కలిశా'నని ఛార్మీ చెప్పుకొచ్చింది. 
 
సుందరకాండ సినిమా చాలా అనుభూతుల్ని మిగిల్చిందని చెప్పిన ఆమె, ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఓ గొప్ప వ్యక్తికి దూరం అయ్యామనే ఫీలింగ్ కలిగిందని అన్నారు. ఆయనకు మొబైల్ ఫోన్ వాడే అలవాటు లేదని, ఇ-మెయిల్స్‌కు కూడా దూరంగా ఉంటారని తెలిపారు. అందుకే, సినిమా షూటింగ్ సందర్భంగా తన ఫీలింగ్స్ అన్నీ ఎనిమిది పేజీల ఉత్తరం ద్వారా రాశానని ఆమె తెలిపారు. దానికి ‘లవ్ లెటర్’ అని పేరుపెట్టినా పర్లేదని ఆమె తెలిపారు. ‘సుందరకాండ’ సమయంలో తామిద్దరం మాట్లాడుకున్న మాటలు, గడిపిన క్షణాలు, వాటివల్ల తాను పొందిన అనుభూతిని అక్షరాల్లో పొందుపరిచి, ‘కోనియాక్’ (బాపూ కిష్టమైన డ్రింక్) బాటిల్‌తో కలిపి పంపించానని ఛార్మీ తెలిపారు.