గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : ఆదివారం, 4 జనవరి 2015 (14:50 IST)

ఆహుతి ప్రసాద్ హఠాన్మరణం... రేపు అంత్యక్రియలు

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్, టాలీవుడ్ నటుడు ఆహుతి ప్రసాద్ కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కేన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన కిమ్స్ ఆస్పత్రిలో ఆదివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక కాయానికి సోమవారం ఎస్‌ఆర్ నగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 
 
ఆహుతి ప్రసాద్ అసలు పేరు అడుసుమిల్లి జనార్ధన వరప్రసాద్. కృష్ణా జిల్లా కోడూరుకు చెందిన ఆయన ‘ఆహుతి’ చిత్రం ద్వారా ఆహుతి ప్రసాద్‌గా స్థిరపడ్డారు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
 
ఆహుతి ప్రసాద్ తనదైన యాస భాషతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నారు. ఆహుతి ప్రసాద్ 2003 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' చిత్రంలో ఉత్తమ ప్రతినాయకుడుగాను, 2008 'చందమామ' చిత్రంలో ఉత్తమ కేరెక్టర్ ఆర్టిస్ట్ గాను రెండు సార్లు నంది పురస్కారం దక్కించుకున్నారు. ఆయన ఇప్పటి వరకు మొత్తం 275 చిత్రాల్లో నటించారు. 
 
ఆహుతి ప్రసాద్ నిన్నే పెళ్లాడుతా, చంద్రమామ చిత్రాల ద్వారా ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేసుకున్నారు. ఈయన తెలుగులోనే కాకుండా తమిళంలో రెండు, కన్నడంలో మూడు, ఒక హిందీ చిత్రంలో కూడా నటించారు. ఆహుతి ప్రసాద్ కేవలం నటుడిగానే కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కూడా పని చేశారు.