గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : గురువారం, 23 ఏప్రియల్ 2015 (17:27 IST)

ఐశ్వర్య యాడ్ వివాదం.. వెనక్కు తగ్గిన జ్యువెల్లరీ సంస్థ..!

బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యా రాయ్‌కు తలనొప్పిగా మారిన జ్యువెల్లరీ యాడ్ వివాదం సమసింది. సదరు సంస్థ వెనక్కు తగ్గిన వివాదాస్పదంగా మారిన పోస్టర్‌ను వెనక్కు తీసుకునేందుకు నిర్ణయించింది. ఆ మేరకు ఆ సంస్థకు చెందిన ఫేసు‌బుక్‌లో వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఐశ్వర్యా రాయ్ తాజాగా నటించిన ఓ జ్యువెల్లరీ ప్రకటనపై బాలల హక్కుల సంఘం నుంచి ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఐశ్వర్య నటించిన ఆ ప్రకటనలో ఆమె నగలతో ఠీవీగా సోఫాపై కూర్చుని ఉండగా, వెనుకే ఆమెకు ఓ బాలుడు గొడుగు పట్టుకున్నట్లున్న ఉండడంపై  బాలల హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదేనా, మీరు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ఇచ్చే ప్రాధాన్యత అంటూ ప్రశ్నించాయి. సదరు యాడ్ ద్వారా బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహించేలా వ్యవహరించారంటూ ఆరోపణలు గుప్పించాయి. ఈ యాడ్‌కు నిరసనగా నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ మాజీ చైర్ పర్సన్ నేతృత్వంలోని ఓ బృందం ఐశ్వర్యకు బహిరంగ లేఖ కూడా రాసింది. 
 
దీంతో ఉలిక్కపడిన ఐశ్వర్య, ఆ యాడ్‌ను చూసుకుని, ఆ తర్వాత తప్పు తనది కాదని, సదరు యాడ్ సంస్థ చేసిన నిర్వాకమని ఆ బృందానికి సమాధానమిచ్చింది. ఇందుకోసం ఆమె ఓ ఫొటోను కూడా ఆ బృందానికి పంపింది. యాడ్ షూటింగ్ సమయంలో ఐష్ వెనుక చిన్నారి లేదట. షూటింగ్ తర్వాత ఐష్ కు చెప్పా పెట్టకుండానే సదరు జ్యువెల్లరీ సంస్థ గొడుగు పట్టుకున్న చిన్నారి ఫొటోను అందులో చేర్చిందట. అయినా ఈ విషయాన్ని జ్యువెల్లర్స్ దృష్టికి తీసుకెళతానని ఐశ్వర్య చెప్పడంతో బాలల హక్కుల సంఘాలు శాంతించినట్టు సమాచారం. 
 
ఈ స్థితిలో సదరు జ్యువెల్లరీ సంస్థ వెనక్కు తగ్గింది. కొత్త దుకాణం ప్రారంభోత్సవం కోసం తాను రూపొందించిన ప్రకటనలో ఐశ్వర్యా రాయ్‌ను నటించినట్టు తెలిపింది.  అయితే క్రియేటివిటీ కోసం ప్రకటనలో కొన్ని మార్పులు చేశామని, అందులో భాగంగానే ఐశ్యర్య వెనుక చిన్నారి ఫోటోను జత చేసినట్టు అంగీకరించింది. ఈ ప్రకటన బాలల హక్కులు హరించే రీతిలో కనిపించినందుకు చింతిస్తున్నట్టు తెలిపింది. కనుక వెంటనే ఆ ప్రకటనను తాము తొలగిస్తున్నట్టు స్పష్టం చేసింది.