గురువారం, 28 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 14 సెప్టెంబరు 2014 (13:22 IST)

'అనుక్షణం' రివ్యూ: క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్

అనుక్షణం నటీనటులు: మంచు విష్ణు, రేవతి, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, సూర్య, మధుశాలినీ తదితరులు; నిర్మాత: 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, ఎవి ఆర్ట్స్‌, దర్శకత్వం: రామ్‌గోపాల్‌ వర్మ.
 
పాయింట్ ‌: టీనేజ్‌ అమ్మాయిల్ని చంపే కిల్లర్‌ కథ
 
రామ్‌గోపాల్‌ వర్మ సినిమాల్లో నటించాలని పలుసార్లు ఆడియో ఫంక్షన్‌లో చెప్పిన మంచు విష్ణు.. 'రౌడీ' తర్వాత ఆయనతో చేసిన సినిమా 'అనుక్షణం'. గతంలో 'అస్త్రం'లో ఎసీపీగా నటించిన విష్ణు ఇందులో డీసిపిగా కన్పిస్తాడు. హైదరాబాద్‌ వంటి సిటీలో సీరియల్‌గా టీనేజ్‌ హత్యలు జరుగుతున్న నేపథ్యంగా వర్మ తీసుకుని దాన్ని టెన్షన్‌ పెట్టిస్తే ఎలా వుంటుందనే చెప్పే ప్రయత్నం చేశాడు. అది ఎలా చేశాడో చూద్దాం.
 
కథ : అర్థరాత్రి నిర్మానుష్యంగా వుండే ప్రాంతంలో జూబ్లీహిల్స్‌ వంటి చోట ఓ అమ్మాయిని ఓ కిల్లర్‌ చంపేస్తాడు. ఇక అక్కడ నుంచి రోజూ ఓ అమ్మాయి చనిపోతుంటుంది. ఆ కేసును గౌతమ్‌ (మంచు విష్ణు) డీసీపీ హోదాలో తన టీమ్‌తో అన్వేషణ మొదలుపెడతాడు. కానీ ఎక్కడా క్లూ దొరకదు. అదే సమయంలో ఇటువంటి సైకో కిల్లర్స్‌ను రీసెర్చ్‌ చేసిన శైలజ(రేవతి) ఈ కేసులో సాయం చేయడానికి గౌతమ్‌ను సంప్రదిస్తుంది. వారి అంచనాల ప్రకారం క్యాబ్‌ డ్రైవర్‌ హంతకుడు. అతన్ని పట్టుకునే క్రమంలో వారు వేసిన ప్లాన్స్‌ అన్నీ ఫెయిల్‌ అవుతాయి. మరోవైపు హోంమంత్రి మనవరాలిని కూడా చంపేస్తాడు. దాంతో కేసు మరింత సీరియస్‌ అవుతుంది. ఆ దశలో కిల్లర్‌ చేసిన ఓ తప్పిదంతో దొరికిపోయినట్లే దొరికి తప్పించుకుంటాడు. ఆ తర్వాత కథ ఏ మలుపు తిరిగింది? అనేది సినిమా.
 
పెర్‌ఫార్మెన్ప్‌
పోలీసు ఆఫీసర్‌గా మంచు విష్ణు సరిపోయాడు. లోగడ అస్త్రం అనే సినిమాలో ఎలా వున్నాడో ఇందులో అదే తరహాలో కన్పించాడు. ఆ మధ్య మెగాస్టార్‌ చిరంజీవి కూడా తన హెయిర్‌స్టైల్‌ను మెచ్చుకున్నారంటూ జుట్టు పెంచి పిచ్చివాడిలా కన్పించిన విష్ణు ఈసారి పోలీస్‌ క్రాఫ్‌తో ఆకట్టుకున్నాడు. కథంతా ఆయనపైనే నడుస్తుంది. టీవీ రిపోర్టర్‌గా మధుశాలినీ గానీ, హోమంత్రిగా కోట శ్రీనివాసరావుగానీ, కిల్లర్‌గా నూతన నటుడు సూర్యకానీ, సైకోలను రీసెర్చ్‌ చేసే పాత్రలో రేవతిగానీ ఎవరికివారు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇందులో సైకో పాత్రధారి కీలకం. ముంబై నుంచి తీసుకువచ్చిన నూతన నటుడితో వర్మ చేయించాడు. కొత్తగా కాబట్టి అతను సరిపోయాడు. 
 
టెక్నికల్‌గా
వర్మ సినిమాలకు ఇదే కీలకం. సౌండింగ్‌ సిస్టమ్‌ గురించి బాగా తెలుసు కాబట్టి సీరియస్‌, టెన్షన్‌ వంటి సీన్స్‌లో అది బాగా ఉపయోగించాడు. సినిమాటోగ్రఫీ కూడా అంతే ఇదిగా వుంది. కొన్నిచోట్ల అసలు లైట్లు లేకుండా సన్‌లైట్‌తోనే లాగించేశాడు. థ్రిల్లర్‌ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కీలకం. అదికూడా బాగానే వుంది. హాలీవుడ్‌ టెక్నిక్స్ అంతా తెలుగులో ఉపయోగించి కొత్త ఫార్మెట్‌లో సినిమా తీశానని చెప్పుకుంటున్న వర్మ... ఇటువంటి తరహాలోనే గతంలో నిషా కొఠారితో ఓ సినిమా తీశాడు. అందులో సస్పెన్స్‌ ఎక్కువగా వుంటుంది. ఈ సినిమాలో అంతగా థ్రిల్‌గానీ, సస్పెన్స్‌ కానీ కన్పించవు. ఎందుకంటే... కిల్లర్‌ ఎలా వుంటాడో ప్రేక్షకుడికి తెలిసిపోతుంది. ఇతనే కిల్లర్‌ అని తెలిస్తే కిక్‌ ఏముంటుంది. ఎలా పట్టుకుంటారనేది పాయింట్‌. అది సిల్లీగానూ వుంటుంది. ఫోన్‌ కాల్‌ ఆధారంగా దొరికిపోతాడు.
 
విశ్లేషణ
చిన్న డాక్యుమెంటరీగా తీసుకున్న అంశాన్ని సినిమాగా తీయడంలో వర్మ సక్సెస్‌ కిందే లెక్క. గతంలో క్షణక్షణం అనే సినిమా తీశాడు. అక్కడ కూడా అడవిలో పరేష్‌ రావల్‌, హీరోహీరోయిన్లు ఒకరికొనకు వెతుక్కుంటూ తప్పించుకున్న క్రమంలో ఉత్కంఠ వుంటుంది. అదే తరహాను అనుక్షణంలో వర్మ ఫాలో అయ్యాడు. రెగ్యులర్‌ కథ ఎలాగూ కాదు. కథను ఎంచుకున్న పాయింట్‌ అమెరికాలో వరుసగా సీరియల్‌ కిల్లర్స్‌ చేసిన జేమ్స్‌ ఆండ్రియా అనే వ్యక్తిని స్పూర్తిగా తీసుకున్నాడు. అటువంటి వ్యక్తిని పట్టుకోవడానికి 20 ఏళ్ళు పట్టిందట. ఆ పాయింట్‌తో మన నేటివిటీకి తీసుకున్నాడు. హత్యలు, శాడిజం ఎలా చేయాలో ఇందులో చూపించాడు. ఇలాంటి చిత్రాలు చూసి కిల్లర్స్‌ ఎడ్యుకేట్‌ అవుతారనేకంటే.. చిత్రాలు చూడకపోవడం బెటర్‌. 
 
మనిషిలో రెండు షేడ్స్‌ వుంటాయి. సాత్వికుడుగానే వున్నా.. అవసరమైతే శాడిస్టు కూడా అవుతాడు. రెండోరకం పాత్ర కిల్లర్‌ది. ఇందుకు కారణాలు లాజిక్‌గా చెప్పాడు. చిన్నతనంలో తూనీగలను పట్టుకుని దారం కట్టి ఎగురవేస్తూ.. వాటిని హింసిస్తూ ఆనందించే రకాలు కొద్దిమంది వారిని బేస్‌ చేసుకుని కథ రాశాడు. అయితే కోడిని చంపడం లేదా.. అది జీవి కాదా? అనే తలతిక్క లాజిక్కులు కూడా కిల్లర్‌ చేత చెప్పిస్తాడు. అవి తినడానికి చంపుతున్నాం. 
 
మనిషిని తినలేం కదా... కిల్లర్‌ అనేవాడు తినడానికి చంపుతున్నాడనే ఆ లాజిక్కు సరిపోతుంది. అప్పుడు నరమాంస భక్షకుడిగా అతన్ని ట్రీట్‌ చేయవచ్చు. కిల్లర్‌లోనూ తను చేసే పనులు కరెక్టే అనేట్లుగా చెబుతాడు. అయితే.. ఎక్కడా కిల్లర్‌ క్రూరంగా చంపిన దృశ్యాలు చూపించడు వర్మ. కానీ పతాక సన్నివేశంలో హీరో.. అతడిని ఎంత కిరాతకంగా చంపుతాడో చూపిస్తాడు. సో.. అసలైన కిల్లర్‌ విష్ణు అన్నమాట. ఇటువంటి చిత్రాలు వర్మ మెంటాలిటీకి దగ్గరగా వున్నవారికి నచ్చుతుంది. కాసేపు చంపడాలు ఎంజాయ్‌ చేస్తూ బయటకువస్తారు. అదో కిల్లర్స్‌ సైకాలజీ...