శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (11:06 IST)

ఇంటర్నెట్‌లో బాహుబలి లీక్ : రాజమౌళి ఫిర్యాదు... కేసు నమోదు!

అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న చిత్రం బాహుబలి. ఈ చిత్రం 13 నిమిషాలతో కూడిన సన్నివేశాలు ఇంటర్నెట్‌లో లీకయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఆ చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్ సైబర్ నేర విభాగ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
రెండేళ్ల క్రితం ‘అత్తారింటికి దారేది’ చిత్రానికి ఈ పరిస్థితి ఎదురుకాగా.. తాజాగా హిట్‌ చిత్రాల దర్శకుడు రాజమౌళి చేపట్టిన భారీ చిత్రం ‘బాహుబలి’కీ అదే పరిస్థితి ఎదురు కావడం గమనార్హం. ఆ సినిమా ప్రథమార్థంలో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న 13 నిమిషాల వీడియో ఆన్‌లైన్‌లో లీక్‌ అయిపోవడంతో చిత్ర యూనిట్‌ నివ్వెరపోయింది. తొలుత ఈ సన్నివేశాలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయని తెలియగానే బాహుబలి టెక్నికల్‌ టీం రంగంలోకి దిగి నిమిషాల వ్యవధిలో ఆ వీడియోలను తొలగించి వేసింది.
 
కానీ, ఆ కాస్త వ్యవధిలోనే వాటిని కొందరు డౌన్‌లోడ్‌ చేసుకోవడంతో ప్రస్తుతం ఆ వీడియో ఫేస్‌బుక్‌, వాట్సప్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృతంగా వ్యాప్తిలోకి వెళ్లిపోయింది. దీనిపై దర్శకుడు రాజమౌళి సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాలుగు రోజుల క్రితమే ఫిర్యాదు అందినప్పటికీ పోలీసులు ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. ‘బాహుబలి’ షూటింగ్‌ దాదాపుగా పూర్తి కావస్తోంది. దీనికి సంబంధించిన ఎడిటింగ్‌ వర్క్‌ నడుస్తోంది. ఎడిటింగ్‌ యూనిట్‌ సిబ్బందే ఈ సన్నివేశాలను బయటకు తీసుకెళ్లారని అనుమానం వ్యక్తమవుతోంది.