శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : శనివారం, 31 జనవరి 2015 (17:03 IST)

బాహుబలి వీడియో లీక్.. హైదరాబాద్‌లో టెక్కీ అరెస్టు!

బాహుబలి క్లిప్పింగ్స్ లీకేజీ కేసులో వర్మ అనే వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మకుట విజువల్ ఎఫెక్ట్లో పని చేస్తున్న వర్మ... పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో వీడియో ఫుటేజీని కాపీ కొట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ దృశ్యాలను వర్మ యూట్యూబ్లో అప్లోడ్ చేశాడని అతని వద్ద జరిపిన విచారణలో వెల్లడైంది. 
 
బాహుబలి చిత్రానికి సంబంధించి కొన్ని దృశ్యాలను సోషల్ మీడియాలో లీక్ చేశారంటూ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిలు  సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సినిమా విరామానికి ముందు 12 నుంచి 15 నిమిషాల దృశ్యాలు వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్లో బహిర్గతమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. 
 
కాగా 80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలోంచి 13 నిమిషాల నిడివిగల సన్నివేశాలు లీకవ్వడం పట్ల టాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఈ కేసులో అరెస్టు చేసిన వర్మ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాగా, అతని స్నేహితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.