శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: సోమవారం, 1 సెప్టెంబరు 2014 (18:01 IST)

బొమ్మలు వేసి.. చిత్రాలు తీసి అలసిన బాపు...

ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు, రచయిత, కార్టూనిస్ట్ బాపు... సత్తిరాజు లక్ష్మీనారాయణ తాను తీసిన చిత్రాల్లో శ్రీరామ, ఆంజనేయ పాత్రలంటే ఎంతో ఆసక్తిని కనబర్చినట్లు స్పష్టమవుతుంటుంది. ఇక ఆయన తీసిన సాంఘికాల్లోనూ పాత్రలు నటించవు... జీవిస్తాయి. ప్రేక్షుకుడు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేస్తాడంటే అతిశయోక్తి కాదు. బాపు చిత్రీకరణ అంటే అంత శక్తివంతమైనది. 
 
మనిషి పుట్టాక ఏదో వ్యాపకం వుండాలి. ఏమీలేనివాడు దున్నపోతుతో సమానమంటారు. అందుకే 'మడిసన్నాక కాసింత కలాపోసనుండాల' అంటూ ముత్యాలముగ్గులో రావుగోపాలరావు గాత్రంతో చెప్పించిన డైలాగ్‌ ఎవర్‌గ్రీన్‌. గ్రామగ్రామాల్లోనూ ఆ మాట మారుమోగింది. దాని రూపకర్త బాపు, రమణలు. ఇద్దరిదీ విడదీయరాని బంధం. ఒకరు గీతలు గీసి బొమ్మలు వేస్తే, దానికి రాతలు రాసి.. అందాలు తెచ్చిన ఘనుడు. 
 
వీరిద్దరి తెలుగు భాష వున్నంత వరకూ అజరామంగా నిలిచిపోయి వుంటారు. 2011లో 'శ్రీరామరాజ్యం' సినిమా వెండితెరపైకి సగానికి పైగా ఎక్కించిన బాపుకు రమణ మరణంతో ఒక చేయి పోయినట్లయింది. ఆ తర్వాత మౌనమునిలా చెన్నైలోని తన ఇంటిలోనే వుంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటి తరానికి పెద్దగా తెలియక పోవచ్చుకానీ... ఆనాటి తరం మొక్క నుంచి వృక్షం దాకా ఎదిగివారికి బాపుతో ఎనలేని సంబంధం. నవ్వించే కార్టూన్‌లు, కవ్వించే బొమ్మలు వంటివి వేసి తనకంటూ బ్రాండ్‌ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఆయన్ను ఒక్కసారి మననం చేసుకుందాం.
 
ఇంటర్వ్యూలు అంటే మైకుల ముందు పెద్దగా మాట్లాడనని ఈ మౌనిముని.. ఓసారి విజయవాడ రేడియో కేంద్రంలో ఆయనకు పద్మశ్రీ అవార్డు పురస్కారం సందర్భంగా సత్కరించింది. అక్కడ కూడా కొద్దిగానే మాట్లాడారు. 'ముత్యాలముగ్గు'లో రావు గోపాలరావు విలనిజం గురించి వెల్లడిస్తూ.... అసలు విలన్‌ అంటే ఎలా వుండాలో రకరకాలుగా గత సినిమాలు చెప్పేశాయి. కానీ ఆయన్ను ఎలా చూపిస్తే బాగుంటుందో కొత్తగా వుంటుందనేది ముత్యాలముగ్గులో చూపించేశాను. నాటకాలు వేసిన రావుగోపాలరావుగారు కూడా దాన్ని అవపోసన పట్టేసి ప్రశంసించారు. ఆ ప్రశంసలే ప్రేక్షకులు కూడా ఇచ్చారు. ఇక కార్టూనిస్టుగా రకరకాలుగా బొమ్మలు గీయడం మామూలే. కానీ చేసిన చిత్రాల్లో సుస్పష్టమైన ముద్ర ఆయన కుంచెలో వుండేది.
 
విదేశీయులు మెచ్చిన బొమ్మలు 
యానిమేషన్‌ చిత్రాలు, బొమ్మలు చూశాం. విదేశీయులు తీసే యానిమేషన్‌లు ఎంత స్పష్టంగా వాస్తవానికి దగ్గరగా వుంటాయో తెలిసిందే. అదే మనవారు చేసిన యానిమేషన్‌ చిత్రాలు అంత స్టఫ్‌ వుండదు. ఐతే బాపు వేసిన బొమ్మలు... విదేశీయుల తీసిన యానిమేషన్‌ల్లా స్పష్టంగా వుంటాయి. ఈ విషయాన్ని ఆంగ్ల రచయిత రెనార్డ్‌ ఓ సందర్భంగా పేర్కొన్నారు. ఎటువంటి బొమ్మ వేసిన అందులో జీవం వుట్టిపడేట్లుగా వుండటం ఆయన్ను ఆశ్చర్యం కల్గించింది. ఇక నవ్వులు పువ్వులు పూయించడంలో అందెవేసిన చేయి. ఆధునిక చిత్రకారులు చాలామంది దేవుళ్ల బొమ్మలు వేయడంలో సృజనాత్మక ఏమీ లేదనుకుంటారు. కానీ బాపు మాత్రం అందులోనూ వినూత్న ఒరవడిని సృష్టించారు. 

'కొండలలో నెలకొన్న' అనే బొమ్మలో కేవలం కిరీటం పెట్టుకున్న కోనేటి రాయుడు.. వేంకటేశ్వరస్వామి తలను మాత్రమే చూడచక్కగా చిత్రించడం ఆయనకే చెల్లింది. ఓసారి కలెక్టర్‌ హోదాలో వున్న ఓ అభిమాని బాపు బొమ్మల గురించి గొప్పగా పొగుడుతుంటే.... నాకన్నా రోడ్డుమీద చాక్‌పీస్‌తో వేసేవాడు గొప్ప చిత్రకారుడుగా అభివర్ణించారు. అది ఆయన ఉన్నత భావానికి నిదర్శనం. ఇలా తనను తాను హైప్‌ చేసుకోవడం ఆయనకు ఇష్టం వుండదు. అందుకే ఆయన బొమ్మల్లో సౌకుమార్యం, సౌందర్యం, శృంగారం ఉట్టిపడేవి.
 
తెలుగు సినిమాకు గుర్తింపు 
తెలుగు చనలచిత్రరంగంలో బాపు అనే దర్శకుడు వున్నాడని బాగా తీయగలడని అన్ని రసాలు వుట్టిపడేలా చేయగలడని ముద్ర ఆపాదించుకున్నవ్యక్తి బాపు. నవరసాలు అంటే బాపు బొమ్మలు గుర్తుకు వస్తాయి. సినిమా జయాలపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు తీయడంలో దిట్ట. బాపు సినిమా రూపుదిద్దుకుంటుందంటే చాలు.. ఏదో ప్రత్యేకత వుంటుందనే అనేవారు. ప్రతి సన్నివేశాన్ని గీసి చూపించేవారు. ఇలా నటించాలనేవారు. ఇప్పుడు డ్రాయింగ్‌ అంటూ కొత్త దర్శకుడు చేస్తున్న పనినే అప్పట్లోనే ఆనాడే ఆయన చేసేశారు. అసలు నటనలో వున్న నవరసాలు ఎలా పలికించాలో తన చిత్రాల ద్వారా చూపించేవారు. అవే ప్రతి కళాకారుడి ఇంటిలో వుంటాయి. ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లోనూ అవే వుంటాయి. ఇక పలు నటనా శిక్షణాలయ సంస్థల్లోనూ రౌద్రం, ఆవేదన, హాస్యం.. అంటూ నవరసాలు ఎలా పలికించాలో గుర్తులుగా వాటిని చూపిస్తుంటారు కూడా. 
 
అలాంటి ఆయన సినీరంగ ప్రవేశం 1967లో జరిగింది. అప్పటినుంచి శ్రీరామరాజ్యం వరకు 51 సినిమాలు దర్శకత్వం వహించారు. తొలి చిత్రం సాక్షి అప్పట్లో ఎంతో చర్చకు దారితీసింది. కోర్టుసీన్‌లో లాయర్‌ వాదించే విధానం. కథాబలం చిత్రానికి ప్రధాన ఆకర్షణ. ఆయన చేసిన చిత్రాల్లో 'బంగారుపిచ్చుక' ఆడకపోయినా ఆయన అధైర్యపడలేదు. రాజేంద్రప్రసాద్‌తో తీసిన 'మిస్టర్‌ పెళ్ళాం' సినిమాకు జాతీయ అవార్డు దక్కింది. అయితే ముత్యాలముగ్గు, మిస్టర్‌పెళ్ళాంతో రెండు నంది అవార్డులు దక్కించుకున్నారు.
 
ప్రతివారికి ఇన్‌స్పిరేషన్‌ 
ఒకప్పటి బొమ్మలు గీసేవారు, దర్శకులు కూడా బాపుగారిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకునేవారు. బాపు దర్శకత్వంలో నటించాలనుకునే ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు. రాజేంద్రప్రసాద్‌, శ్రీకాంత్‌ వంటివారు ఆయన చిత్రాల్లో నటించాలనే ఉవ్విళ్లూరారు. నటనకు నిర్వచనం ఆయన చిత్రాలనేవారు. ఆంధ్రపత్రికలో కొంతకాలంపాటు పొలిటికల్‌ కార్టూనిస్టుగా వేశారు. ఆయన తర్వాత కార్టూనిస్టుగా చేరిన వారు కుంచె సన్యాసం చేసేశారు. కానీ బాపుగారు చివరి వరకూ గీస్తూనే వున్నారు. అది ఆయన కుంచెలోని ప్రత్యేకత. అందుకే ఆయన.. గీయాల్సినవి, తీయాల్సినవి భూలోకంలో లేవు. పైలోకంలో వున్నాయంటూ రమణ తీసుకెళ్ళినట్లు వెళ్ళిపోయారు. ఆయనకు వెబ్‌దునియా నివాళులు అర్పిస్తోంది. ఇప్పటితరం ఆయన్నుంచి ఎంతో నేర్చుకోవాల్సివుంది కూడా.