గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By CVR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (10:44 IST)

'అభినందన' దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ కన్నుమూత

ప్రముఖ సినిమాటోగ్రాఫర్, దర్శకుడు అశోక్ కుమార్ అగర్వాల్ మృతి చెందారు. పలు భారతీయ భాషల్లో దాదాపు వంద సినిమాలకు ఆయన కెమెరామన్గా పనిచేశారు. జీన్స్ వంటి పలు చిత్రాలు ఆయన కెమెరా నుంచి జాలువారినవే.
భారతీయ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో కలిసి అశోక్ కుమార్ పనిచేశారు. 'నెంజతై కిల్లాతె' అనే తమిళ చిత్రానికి గాను 1980లో ఆయన ఉత్తమ సినిమాటోగ్రాఫర్గా జాతీయ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా సచ్చాప్యార్ వంటి హిందీ, బ్యాక్ వాటర్స్ వంటి ఇంగ్లీషు సినిమాలకు కూడా ఆయన సినిమాటోగ్రాఫర్గా వ్యవహరించి అభిమాన బలాన్ని పొందారు.
 
సినిమాటోగ్రాఫర్‌గానే కాకుండా దర్శకుడిగా కూడా అశోక్ కుమార్ సత్తా చాటుకున్నవారే. తెలుగులో సంచలన విజయం సాధించిన ప్రేమకథా చిత్రం 'అభినందన' సహా కొన్ని తమిళ, హిందీ సినిమాలకు అశోక్ కుమార్ దర్శకత్వం వహించారు. 
 
గత ఆరు నెలలుగా ఆయన అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడుతూ వచ్చినట్టు ఆయన కుటుంబీకులు తెలిపారు. చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని పలు ఆస్పత్రులలో ఆయనకు వివిధ చికిత్సలు అందించినట్టుగాను, చివరికి ఆయన ఆరోగ్యం మరీ విషమించడంతో కొన్ని రోజుల క్రితమే ఇంటికి తీసుకొచ్చామని వారు తెలిపారు.