శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 25 మార్చి 2015 (18:47 IST)

రాజకీయాలతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కంపుకొడుతోంది: రాజేంద్రప్రసాద్

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ రాజకీయాలతో కంపుకొడుతోందని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఫైర్ అయ్యారు. ఇవి రాజకీయ ఎన్నికలు కావని, సికింద్రాబాద్ నియోజకవర్గానికి జరుగుతున్న పోటీ కాదని... 'మా' ఎన్నికలని, ఇక్కడ రాజకీయాలు చేయరాదని జయసుధను ఉద్దేశించి రాజేంద్రప్రసాద్ ఎద్దేవా చేశారు. జయసుధను ఓ శక్తి (ఎంపీ) వెనకుండి నడిపిస్తోందని మురళీమోహన్ ను ఉద్దేశించి అన్నారు. ఆ శక్తి ఢిల్లీ నుంచి చక్రం తిప్పుతానంటోందని విమర్శించారు. 
 
అందరికీ ఫోన్లు ఇస్తున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని... సెల్ ఫోన్ తీసుకుని ఓటు వేసేంత ఖర్మ సినీ కళాకారులకు పట్టిందా? అని రాజేంద్రప్రసాద్ నిలదీశారు. అబద్ధాలకు, విమర్శలకు తాను దూరంగా ఉంటానని చెప్పారు. మాపై వారికి ఎందుకింత కోపం అన్నది తెలియజేస్తే తాము సంతోషిస్తామన్నారు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే మృత్యుంజయ హోమం జరిపించారని... ఇదంతా కేవలం ఎన్నికల స్టంటేనని ఆరోపించారు.
 
తాను 'మా' అధ్యక్షుడిగా ఎన్నికైతే... శ్రేయోభిలాషులు, మిత్రుల నుంచి రూ. 5 కోట్లు సేకరించి ఓ నిధిని ఏర్పాటు చేస్తానని చెప్పారు. కళాకారులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు. ఇంత వరకు 'మా'కు సొంత బిల్డింగ్ కూడా లేదని... మంచి బిల్డింగ్ కట్టిస్తానని చెప్పారు. సినిమాలో హీరో, హీరోయిన్ ఇద్దరూ ఉంటారని... ఇక్కడ పురుషాధిక్యతకు తావులేదని చెప్పారు.