శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2015 (19:59 IST)

''మా'' ఎన్నికల నిర్వహణకు సిటీ సివిల్ కోర్టు గ్రీన్ సిగ్నల్: జయసుధ ప్రెస్ మీట్!

మా (మూవీ ఆరిస్ట్స్‌ అసోసియేషన్‌) ఎన్నికల నిర్వహణకు సిటీ సివిల్‌ కోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల ఫలితాలను మాత్రం వెల్లడించవద్దని కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఓట్ల లెక్కింపును కూడా చేపట్టవద్దని తెలిపింది. ఎన్నికల ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలని కోర్టు ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఫలితాలు వెల్లడించవద్దని కోర్టు ఆదేశాలు జారీచేసింది. ఆదివారం జరగబోయే ఎన్నికలను నిలిపేయాలని 'మా ఎన్నికల్లో పోటీ చేస్తున్న కళ్యాణ్‌ అనే అతను కోర్టుకెళ్లాడు. దీనిపై వాదనలు విన్న కోర్టు మా ఎన్నికలు నిర్వహించేందుకు ఓకే చెప్పేసింది. 
 
మా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. మా అధ్యక్ష బరిలోకి దిగిన అగ్ర నటులు రాజేంద్రప్రసాద్, జయసుధ నువ్వా నేనా అన్నట్లు ఆరోపణలు చేసుకుంటున్నారు. మా సభ్యులకు పోటీపడి మంచిచేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో జయసుధ శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కళాకారులు తిండికి ఉన్నాలేకున్నా పని ఉంటే చాలంటారని, అలాంటి వారికి పనికల్పించేందుకు పాటుపడతామని అవకాశం కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. 
 
అవతలివారు చెప్పిన దానికంటే తాను ఎక్కువ చేస్తాననో లేక తక్కువ చేస్తాననో చెప్పలేనని, చేసి చూపిస్తానని జయసుధ తెలిపారు. నిధుల సేకరణ కూడా ప్యానెల్ సభ్యుల నుంచే ప్రారంభిస్తామన్నారు. ప్రతి ఆరు నెలలకు ఓ కార్యక్రమం నిర్వహించి నిధులు సేకరిస్తామని వెల్లడించారు. తన వెనుక ఎవరూ ఉండి నడిపించడం లేదని ఆమె స్పష్టం చేశారు. ఇంత మందికి సహాయం చేస్తామని చెప్పడమంటే మిగిలిన వారికి సహాయం చేయబోమని చెప్పడమా? అని ఆమె ప్రశ్నించారు.
 
ఆడదాన్ని గాజులు తొడుక్కుని కూర్చోలేదని.. అంతకు ధీటుగా చేతల్లో చూపిస్తానని జయసుధ చెప్పారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, కళాకారుల్లో చిన్న పెద్ద ఉండరని, పని ఉన్న, పని లేని కళాకారులు ఉంటారని తెలిపారు. తనను పోటీ చేయమని కోరితేనే మా అధ్యక్షురాలిగా బరిలోకి దిగానని జయసుధ స్పష్టం చేశారు. సినీ పరిశ్రమలో మంచి చెడ్డలు తనకు తెలుసని ఆమె చెప్పారు.
 
పేద కళాకారులు తమ పిల్లలకు వివాహం చేయాలని భావిస్తే, వారికి అవసరమైన సహాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. మా సభ్యులందరికీ పెన్షన్లు, హెల్త్ కార్డులు అందజేస్తామని ఆమె వెల్లడించారు. 
 
తనను చాలా అవహేళన చేశారని, తనను హేళన చేయడంపై కోపం కట్టలు తెంచుకున్నా.. అవతలి వ్యక్తులపై స్పందించాల్సి రావడం తన స్థాయికి తగినది కాదని ఆగిపోయానని జయసుధ చెప్పారు. అవతలి వారు ఏదో అన్నారని, తాను కూడా ఏదీ అనలేనని, అందుకే తాను టీవీలకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదని ఆమె స్పష్టం చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలపై చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారని, కొందరు మా అధ్యక్షపదవి అవసరమా? అని కూడా ప్రశ్నించారని ఆమె తెలిపారు. 
 
అయితే, కొందరు అభిమానులు... వాళ్లకి కౌంటర్ ఇస్తే, ఇంకోటి అంటారని, అలాంటి వాటికి అవకాశం ఇవ్వవద్దని సూచించారని జయసుధ చెప్పారు. తన స్థాయికి తగని వారు తనను ఎగతాళి చేసినప్పుడు కోపం వచ్చిందని ఆమె తెలిపారు.