శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 1 అక్టోబరు 2014 (18:36 IST)

గోవిందుడు అందరివాడేలే కథ, విశ్లేషణ...

గోవిందుడు అందరివాడేలే నటీనటులు: రామ్‌ చరణ్‌, కాజల్‌ అగర్వాల్‌, శ్రీకాంత్‌, ప్రకాష్‌రాజ్‌, జయసుధ, కమిలినీ ముఖర్జీ, ఎం.ఎస్‌. నారాయణ తదితరులు
 
నిర్మాత: బండ్ల గణేష్‌ రచన: పరుచూరి బ్రదర్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ,
 
పాయింట్‌: తండ్రి కోరికమేరకు మనవడు తాత మనస్పుమార్చిన కథ.
 
రామ్‌చరణ్‌, కృష్ణవంశీ సినిమా అనేసరికి ఒక క్రేజ్‌ ఏర్పడింది. రామ్‌ చరణ్‌ సినిమా అంటేనే మగధీర తర్వాత మళ్ళీ అంతటి హిట్‌ రాలేదు. ఆరెంజ్‌ వంటి లవ్‌ సినిమాను తీసి కథను సరిగ్గా తీయలేకపోవడంతో ఫెయిల్‌ అయిందని ఇటీవలే చెప్పిన రామ్‌ చరణ్‌ తేజ్‌... గోవిందుడు అందరివాడేలే సినిమా చేశాడు. మాస్‌, యాక్షన్‌ అంశాన్ని పక్కనపెట్టి కృష్ణవంశీ తరహాలో చందమామ, మురారి చిత్రాల ఫార్మెట్‌లో వుందని ముందుగానే చెప్పిన ఈ చిత్రంలో తను ఏం చేశాడు.. ఏం చెప్పదలచుకున్నాడో చూద్దాం.
 
కథగా చెప్పాలంటే.... అభిరామ్‌ (రామ్‌చరణ్‌) లండన్‌లో పుట్టిపెరిగిన వాడు. తండ్రి ఓ డాక్టర్‌. అక్కడి యూనివర్శిటీలో డీన్‌ అవుతున్నట్లు సమాచారం అందుతుంది. తీరా అది వేరేవారికి దక్కుతుంది. దీంతో బాధపడుతూ.... గతంలో చేసిన పనులే నన్ను ఈ స్థితికి తెచ్చాయని కొడుకుతో చెబుతాడు. అదేమిటని కొడుకు అడిగితే.. ప్లాష్‌బ్యాక్‌లో చూపిస్తాడు. హైదరాబాద్‌ అవతల చక్కటి పల్లెటూరి. ఊరికి పెద్ద... బాలరాజు (ప్రకాష్‌రాజ్‌). ఊరిలో కనీసం డాక్టర్‌ కూడా లేకపోవడంతో.. పెద్ద కొడుకు రెహమాన్‌ను డాక్టర్‌ చదివిస్తాడు. ఊరిలో ఆసుపత్రి పెట్టి అందరికీ సేవ చేయాలని బాలరాజు ఆశ.  కానీ కొడుకు... లండన్‌కు చెందిన క్లాస్‌మేట్‌ను పెండ్లి చేసుకుని ఇల్లరికం వెళ్ళిపోవడంతో షాక్‌కు గురైన బాలరాజు.. .. తన పెద్ద కొడుకు చచ్చిపోయాడనే ఇంటి నుంచి వెళ్ళగొడతాడు. ఈ కథ విన్న అభిరామ్‌... ఇండియాకు వచ్చి తన తాత మనసుమార్చి ఎలా అందరివాడు అయ్యాడనేది సినిమా.
 
చెప్పుకోదగిని పాయింట్లు..
రామ్‌చరణ్‌ పాత్ర ఎన్‌ఆర్‌ఐ. ఇంతవరకు తను చేయని పాత్ర. కథలోని పాయింట్‌ చక్కని పల్లెటూరి వాతావరణంతో కూడుకుంది. కాజల్‌ అగర్వాల్‌ పాత్రకు సరిపోయింది. వయస్సులో హీరో కంటే పెద్దదిలా అనిపిస్తుంది. శ్రీకాంత్‌ ఇందులో హీరోకు బాబాయ్‌గా నటించాడు. ఆయన నటన ఇందులో యూత్‌ను ఆకట్టుకుంటుంది. కోట శ్రీనివాసరావు, రావు రమేష్‌లు అభిరామ్‌కు తాత, బాబాయ్‌లు అవుతారు. విలనిజం వున్న పాత్రలు పోషించారు. ప్రకాష్‌రాజ్‌ పాత్ర కీలకం. సినిమాకు ఆయువుపట్టు... పాత్రలో ఒదిగిపోయారు. జయసుధ సహజ నటిగా తన పాత్రను పోషించింది. కమిలినీ ముఖర్జీ... శ్రీకాంత్‌కు జోడిగా నటించింది. ఇక మిగిలిన పాత్రలన్నీ షరా మూమూలే.. సినిమాలో చివరి 20 నిముషాలు రొటీన్‌ ఫ్యామిలీ చిత్రాల వలే వుంటుంది. 
 
 
మైనస్‌ పాయింట్లు... 
సినిమాకు హీరో పాత్ర కీలకం. అది కథకు సరిపడిన విధంగా వుండాలి. ఇందులో ఫంకు స్టైల్‌లో జుట్టు పెంచుకున్న రామ్‌ చరణ్‌ను ఎక్కువసేపు చూసేట్లుగా వుండదు. రాజ్‌కిరణ్‌ అనే నటుడ్ని మార్చేసి ప్రకాష్‌రాజ్‌ను పెట్టడం సరైన నిర్ణయమే. శ్రీకాంత్‌, కమలీని ఇద్దరూ బావా మరదళ్లే.. కానీ వారిపై ఎటువంటి లవ్‌ ట్రాక్‌ వుండదు. తండ్రి పెంపకంలో గాలోడిగా తిరిగిన వ్యక్తిగా నటించాడు. తన మనవడు అనే విషయం సరైన టైమ్‌లో ప్రకాష్‌రాజ్‌కు తెలిస్తే బాగుండేది. కానీ... అది చూపే విధానంలో స్టఫ్‌లేదు. దాంతో సెకండాఫ్‌లో సీరియస్‌నెస్‌ లోపించింది. 
 
టెక్నికల్‌గా...
దర్శకుడిగా.. కృష్ణవంశీ ఇటువంటి కుటుంబ సంబంధాలున్న చిత్రం చేయడాన్ని అభినందించాలి. సమీర్‌ రెడ్డి ఫొటోగ్రఫీ ముచ్చటగా వుంది. సంగీతపరంగా యువన్‌ శంకర్‌ రాజా పర్వాలేదు. రీరికార్డింగ్‌ కాస్త ఎఫెక్ట్‌ వుంటే బాగుండేది. డైలాగ్స్‌ పరంగా ఎట్రాక్ట్‌ చేయడానికి ఐదుగురు పనిచేశారు. పరుచూరిబ్రదర్స్‌ గత చిత్రాల్లోమాదిరిగానే డైలాగ్స్‌ రాశారు. దానికితోడు మరో ఇద్దరు రచయితుకూడా పని కల్పించారు. మన పని మనం చేసుకోవాలి.. ఊరికోసం ఆలోచించాను.. కుటుంబం కోసం ఆలోచించలేదు.. అనే డైలాగ్స్‌లు గత కాలం నుంచి వస్తున్న డైలాగ్సే.. నిర్మాణపరంగా వాల్యూస్‌ బాగానే వున్నాయి.
 
విశ్లేషణ 
గోవిందుడు అందరివాడేలే... ఈ సినిమా... బ్లాక్‌ అండ్‌ సినిమాల్లోని ఉమ్మడి కుటుంబం తరహాలో వుంది. ఇప్పటితరానికి తెలియని విలువల పేరుతో వస్తున్న సినిమాల్లో ఇదొకటి. అందరూ చక్కని నటన ప్రదర్శించినా... ఎక్కడా ఫీల్‌ కన్పించదు. దసరా నాడు విడుదలయిన ఈ సినిమా కాన్సెప్ట్‌ అంతా సంక్రాంతి పండగ నేపథ్యంలో సాగుతుంది. కథను కాస్త మార్చి తీస్తే బాగుండేది. పాటలపరంగా సాహిత్యం కొత్తగా లేకపోయినా.. బోర్‌గా అనిపించదు. 
 
కుటుంబ చిత్రాలు తీసే కృష్ణవంశీ... ఈ చిత్రంలో నేటివిటీ ఎక్కువ భాగం తమిళ వాసన కన్పిస్తుంది. ఈ చిత్రంలో ఎక్కువభాగం టెక్నీషియన్స్‌ తమిళులు పనిచేయడమే అందుకు కారణం కావచ్చు. నేటివిటీ కోసం కథను కొద్దిగా మార్చి తీసినా... దాన్ని ప్రెజెంటేషన్‌ విషయంలో.... నిన్నేపెళ్ళాడుతా, మురారి చిత్రాల్ని పోలివున్నాయి
 
మొదటిభాగంలో రామ్‌ చరణ్‌ పాత్ర... నిన్నే పెళ్ళాడుతాలో హీరోయిన్‌ పాత్రను పోలి వుంటుంది. మరోవైపు... సీతారామయ్యగారి మనవరాలు స్పూర్తితో మీనా పాత్రను రామ్‌ చరణ్‌ చేసినట్లు అనిపిస్తుంది. కుటుంబమంతా కలిసి ఒక్కటిగా అవ్వాలనే కాన్సెప్ట్‌ మురారిది. ఇలా అన్ని సినిమాలు కలిపి... చేసిన సినిమా గోవిందుడు. దసరానాటికి సినిమాలు ఏమీ లేవు గనుక... గోవిందుడు స్టామినా ఏమిటో చూడాలి మరి.