శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (11:30 IST)

‘హితుడు’ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ లాంచ్‌: జగపతిబాబు కీలక పాత్రలో..!

జగపతిబాబు, మీరా నందన్‌ ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాత సుంకర మధుమురళి సమర్పణలో కేఎస్వీ ఫిలింస్‌ పతాకంపై విప్లవ్‌(VIPLOVE)ను దర్శకుడుగా పరిచయం చేస్తూ కేఎస్వీ నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం ‘హితుడు’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ శనివారం హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పార్లమెంట్‌ సభ్యులు డా॥ ఎన్‌.శివప్రసాద్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు శివనాగేశ్వరరావు, చిత్ర దర్శకుడు విప్లవ్‌, చిత్ర నిర్మాత కేఎస్వీ, నిర్మాతల మండలి కార్యదర్శి టి.ప్రసన్నకుమార్‌, ప్రముఖ పారిశ్రామిక వేత్త మురళీకృష్ణ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత కేఎస్వీ మాట్లాడుతూ ` ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చిత్రం చేయడం అనేది ఒక సాహసోపేతమైన ప్రయత్నం. ఈ చిత్రంలో ప్రముఖ హీరో జగపతిబాబుగారు ప్రధాన పాత్ర పోషించారు. యువ దర్శకుడు విప్లవ్‌ తొలి ప్రయత్నంగా చేసిన ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఇది ఒక సామాజిక అవసరాన్ని గుర్తు చేస్తూ తీసిన చిత్రం. ఇందులో మాటలున్నాయి గానీ మాటల చిత్రం కాదు, పాటలున్నాయిగానీ పాటల చిత్రం కాదు. దర్శకత్వ ప్రతిభ వుంది గానీ కేవలం దర్శకత్వ ప్రతిభను చూపించడానికే తీసిన చిత్రం కాదు. ఇది కార్యాచరణకు సంబంధించిన చిత్రం.

సమాజంలో జరగాల్సిన ముఖ్యమైన కార్యం ఏదైతే వుందో దాన్ని ప్రేరేపిస్తూ తీసిన సినిమా. మిగతా విషయాలన్నీ ప్రేక్షక మహాశయులు తెరమీద చూస్తారన్న విపరీతమైన ఆశాభావంతో ఈ చిత్రాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం’’ అన్నారు. డా॥ ఎన్‌.శివప్రసాద్‌ మాట్లాడుతూ ` ‘‘1990లో ఎస్‌.వి. మెడికల్‌ కాలేజీ నుంచి మెడికల్‌ పట్టా తీసుకున్న నేను డైరెక్టర్‌ని అయ్యాను. 25 సంవత్సరాల తర్వాత అదే కాలేజీ నుంచి మెడికల్‌ పట్టా తీసుకున్న విప్లవ్‌ ఈ సినిమా ద్వారా దర్శకుడుగా పరిచయమవుతున్నాడు. ఇది నేను చాలా సంతోషిస్తున్న విషయం.

మరో విషయం ఏమిటంటే ఈ చిత్ర నిర్మాత కేఎస్వీగారు సమకాలీన కాలంలో గొప్ప రైటర్‌. కేఎస్వీ పేరుతోనే చాలా రచనలు చేశారు. కొడుక్కి విప్లవ్‌ అని పేరు పెట్టాడంటేనే అర్థం చేసుకోవచ్చు. ఆయన నాకు స్నేహితుడు. ఆ స్నేహితుడి కుమారుడే విప్లవ్‌. ఈరోజు నా స్నేహితుడు నిర్మించిన ‘హితుడు’ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ లాంచ్‌కి నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తిరుపతి నుంచి మంచి డైరెక్టర్స్‌ రావాలన్నది నా కోరిక.

విప్లవ్‌ డెఫినెట్‌గా నా కోరిక తీరుస్తాడని ఆశిస్తున్నాను. ఈ చిత్రానికి ‘హితుడు’ అనే టైటిల్‌ పెట్టాడంటేనే అది గొప్ప విషయంగా భావిస్తున్నాను. ఒక తండ్రి కొడుకు కోసం నిర్మించిన సినిమా ఇది. ఒక కొడుకు తండ్రి ఆశయాన్ని సఫలీకృతం చెయ్యడానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీసిన సినిమా ఇది. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకాదరణ పొంది, విప్లవ్‌ మంచి దర్శకుడుగా పేరు సంపాదించకుంటాడని ఆశిస్తున్నాను’’ అన్నారు. 
 
శివనాగేశ్వరరావు మాట్లాడుతూ ` ‘‘‘హితుడు’ అనే టైటిల్‌ నాకు బాగా నచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక మనిషికి ఒక హితుడు వుంటాడా అన్నది కొంచెం ఆశ్చర్యం కలిగించే ప్రశ్నే. హితుడు, సన్నిహితుడు ప్రతి మనిషికీ ఎంతో అవసరం. అంత ప్రాముఖ్యం వున్న ఈ సినిమాకి హితుడు అనే టైటిల్‌ కూడా బాగా కుదిరింది. శివప్రసాద్‌గారిలాగే డాక్టర్‌ నుంచి డైరెక్టర్‌గా మారిన విప్లవ్‌ ఈ సినిమాతో మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకోవాలని, సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. 
 
టి.ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ‘‘మంచి కమర్షియల్‌ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కావాలని అందరూ అనుకుంటారు. కానీ, సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సందేశంతో ‘హితుడు’ అనే చక్కని సినిమాతో డైరెక్టర్‌గా వస్తున్న విప్లవ్‌ను అభినందించాలి. ఈ చిత్రంలోని ఐదు పాటల్నీ అనంత శ్రీరామ్‌ రచించగా, టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కోటి సంగీతాన్ని అందించారు. ఇంత మంచి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు. విప్లవ్‌(VIPLOVE) మాట్లాడుతూ ` ‘‘హితుడు అంటే మేలు కోరేవాడు. ఎవరైనా రాంగ్‌ స్టెప్‌ వేస్తుంటే నువ్వు వెళ్తున్న దారి కరెక్ట్‌ కాదని సరైన మార్గంలో పెట్టేవాడు. లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ అలాంటి హితుడు చాలా అవసరం. ఈ సినిమాని నేను అనుకున్న విధంగా తియ్యడంలో నాకు చాలా మంది హితులు తోడున్నారు. ఈ సినిమాలో శివప్రసాద్‌గారి కోసం నాలుగైదు రోజులకు ఒక క్యారెక్టర్‌ అనుకున్నాం. కానీ, కుదరలేదు. నెక్స్‌ట్‌ మూవీ తప్పకుండా ఆయనతో చేస్తాను’’ అన్నారు. 
 
జగపతిబాబు, మీరా నందన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: కోటి, పాటలు: అనంతశ్రీరామ్‌, సినిమాటోగ్రఫీ: భరణి కె.ధరన్‌, ఎడిటింగ్‌: ధర్మేంద్ర కాకరాల, సమర్పణ: సుంకర మధు మురళి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విప్లవ్‌ (VIPLOVE).