శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 22 ఆగస్టు 2014 (14:48 IST)

నాది 'వర్మ సిద్ధాంతం'... జె.డి, ఐస్ క్రీం 3 తీస్తా... వర్మ

సాధారణంగా ఓ సినిమాకు ఫస్ట్‌ లుక్‌ అంటే ఒకటే రిలీజ్‌ చేస్తారు. కానీ.. దర్శకుడు రాంగోపాల్‌వర్మ మాత్రం తన తాజా చిత్రం కోసం ఏకంగా 20 ఫస్ట్‌ లుక్స్‌ విడుదల చేశారు. భీమవరం టాకీస్‌ పతాకంపై తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను రాంగోపాల్‌వర్మ విడుదల చేసారు. హైద్రాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్‌ ప్రివ్యూ ధియేటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో.. ఈ చిత్రంలో నటిస్తున్న జె.డి.చక్రవర్తి, నందు, భూపాల్‌, సిద్దు, ధనరాజ్‌, నవీన, శాలిని, గాయత్రిలతోపాటు ఫ్లోకేమ్‌ ఇన్‌ఛార్జ్‌ అరుణ్‌ ఇక్బాల్‌ ఖాన్‌ చౌదరి, స్టిల్‌ ఫోటోగ్రాఫర్‌ నవీన్‌ కల్యాణ్‌, పోస్టర్స్‌ డిజైనర్‌ కాశి తదితరులు పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా రాంగోపాల్‌వర్మ మాట్లాడుతూ.. 'మూస పద్ధతులకు భిన్నంగా రూపొందుతున్న 'ఐస్‌క్రీమ్‌-2' చిత్రం ఫస్ట్‌ లుక్‌ను కూడా.. పాత పద్ధతులకు విరుద్ధంగానే విడుదల చేస్తున్నాం. ఫస్ట్‌ లుక్‌ అంటే.. ఒకే ఒక్క స్టిల్‌ మాత్రమే ఎందుకు రిలీజ్‌ చేయాలి? అనే ఆలోచనతో ఒకేసారి 20 ఫస్ట్‌ లుక్స్‌ను రిలీజ్‌ చేసాం. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అయితే.. అందుకు ఓ నాలుగు రోజుల ముందు.. అంటే సెప్టెంబర్‌ 15న 'ఐస్‌క్రీమ్‌-3' చిత్రాన్ని ప్రారంభించబోతున్నాం. 
 
'ఐస్‌క్రీమ్‌' సిరీస్‌ నుంచి నెలకు ఓ సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నాం' అన్నారు. భీమవరం టాకీస్‌ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ చెప్పే మాటే ఇప్పుడు కూడా మరోసారి చెబుతున్నాను. నిర్మాతగా ఎక్కడో నేల మీద ఉన్న నన్ను.. ఆకాశమంత ఎత్తుకి తీసుకువెళ్లారు మా రాంగోపాల్‌వర్మగారు. ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను. 
 
'ఐస్‌క్రీమ్‌' చిత్రాన్ని రెండే రెండు మెయిన్‌ క్యారెక్టర్స్‌తో.. ఒకే ఒక ఇంటిలో షూట్‌ చేసిన ఆర్జీవి.. 'ఐస్‌క్రీమ్‌-2'ను మొత్తం ఔట్‌డోర్‌లో పదహారు ప్రధాన పాత్రలతో ఎంతో ఎక్స్‌ట్రార్డినరీగా తీసారు. కథాపరంగా రెంటికీ సంబంధం లేదు' అన్నారు. ప్రధాన పాత్రధారి జె.డి.చక్రవర్తి మాట్లాడుతూ..'ఆర్జీవిని అందరూ ఎప్పట్నుంచో లెజెండ్‌ అంటూనే ఉన్నారు. కానీ.. 'ఐస్‌క్రీమ్‌-2' సినిమాలో నటిస్తున్నప్పుడు మాత్రం.. నిజంగా ఆయన లెజెండ్‌ అనిపించింది నాకు. 
 
సినిమా మేకింగ్‌లో నిజంగా ఇదొక వండర్‌. అందరూ కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తుంటారు. కానీ నేను మాత్రం ఎప్పుడూ 'వర్మ సిద్ధాంతాన్ని' ఫాలో అవుతుంటాను' అన్నారు. నందు, సిద్దు, భూపాల్‌, నవీన, అరుణ్‌ ఇక్బాల్‌ఖాన్‌ చౌదరి, ధనరాజ్‌, నవీన్‌ కల్యాణ్‌ తదితరులు రాంగోపాల్‌వర్మ సినిమాకు పని చేసే అవకాశం లభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసారు!!