శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 24 డిశెంబరు 2014 (14:05 IST)

దటీజ్ కె.బాలచందర్....

కె. బాలచందర్ అలియాస్ కైలాసం బాలచందర్. దక్షిణ భారతదేశంలో ఉన్న దర్శక దిగ్గజాల్లో ఒకరు. దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని నలుమూలలా చాటిన దర్శకతేజం. ఈయన 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహిస్తే.. ఎంతో మంది ప్రఖ్యాత సినీనటులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. తమిళంలో ఓ రజనీకాంత్, ఓ కమల్ హాసన్, ఓ ప్రకాష్ రాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే అనేక మంది పేర్లు వినిపిస్తాయి. అలాంటి బాలచందర్.. ఇక లేరు. అనారోగ్య సమస్యలతో చెన్నైలో మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన దర్శకత్వం వహించిన 'మరో చరిత్ర' చిత్రపరిశ్రమలో ఓ చరిత్ర సృష్టిస్తే.. కె బాలచందర్ తన సినీ ప్రయాణాన్ని సువర్ణాక్షరాలతో లిఖించుకుని వెళ్లిపోయారు. 
 
బాలచందర్ జీవిత చరిత్రను ఓసారి విశ్లేషిస్తే... 1930 జులై 9వ తేదీన సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన అత్యంత సాధారణ వ్యక్తి. దక్షిణ తమిళనాడులోని తంజావూరు జిల్లాలో 'నన్నిళం' అనే గ్రామంలో... కైలాసం దండపాణి, సరస్వతి దంపతులకు ఆయన జన్మించారు. తన 8 యేళ్ళ వయస్సు నుంచే ఆయనకు సినిమాలంటే మహా పిచ్చి. 12వ ఏట నుంచే చిన్న చిన్న డ్రామాలు, నాటకాలు రాస్తూ.. వేసేవారు. ఆ తర్వాత అన్నామలై యూనివర్శిటీలో డిగ్రీలో చేరారు. ఆ సమయంలో కూడా స్టేజ్ షోలు ఇచ్చేవారు. 
 
చదువు పూర్తయిన తర్వాత తిరువారూరులో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. 1950లో అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో గుమాస్తా ఉద్యోగం రావడంలో చెన్నైకు మకాం మార్చారు. ఉద్యోగం చేస్తూనే నాటకాలు రాసిన బాలచందర్... 'యునైటెడ్ అమెచ్యూర్ ఆర్టిస్ట్స్' అనే డ్రామా కంపెనీని ఏర్పాటు చేసి, పలు ప్రదర్శలు ఇచ్చారు. ఆయన కంపెనీలో ప్రముఖ నటులు షావుకారు జానకి, నగేష్, శ్రీకాంత్ లాంటి వారు కూడా ఉండేవారు. 
 
చిన్నతనం నుంచి సినిమాలపై తనకున్న అమితమైన ప్రేమే ఆయనను ఈ స్థాయికి తీసుకొచ్చింది. చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన మధ్యతరగతి సమాజం, అనుబంధాలు, ఈర్ష్యలు, బాధలు, కష్టాలు, సంతోషాలు,... ఇవే ఆయన సినిమాలకు మూలకథలుగా ఎంచుకుని నిర్మించిన చిత్రాలు చరిత్రను తిరగరాశాయి. అవే బాలచందర్ పేరును సుస్థిరం చేశాయి. ఆ చిత్రాలు ఓ మైలురాళ్ళుగా నిలిచిపోయాయి. నాటి నుంచి నేటి వరకు సినీరంగంలో అగ్రతారలుగా వెలుగొందిన, వెలుగొందుతున్న ఎంతో మందికి బాలచందర్ సినీ జీవిత భిక్ష పెట్టారు. ఆయన సినిమాలతో ప్రాణం పోసుకున్న ఎందరో నటులు, టెక్నీషియన్లు సినీ పరిశ్రమలో అగ్రపథంలో కొనసాగుతున్నారు.
 
దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు సినీపరిశ్రమలో కొనసాగిన బాలచందర్... స్క్రీన్ రైటర్‌గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1965లో తొలిసారిగా ఎంజీఆర్ నటించిన 'దైవతాయ్' సినిమాకి మాటలు రాసే అవకాశం బాలచందర్‌కు దక్కింది. అదే ఏడాది (1965) 'నీర్ కుమిళి' అనే సినిమాకు దర్శకత్వం వహించే ఛాన్స్ కొట్టేశారు. అప్పటి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూసిన సందర్భమే లేదు. దాదాపు 100 సినిమాలకు దర్శకుడిగానో, నిర్మాతగానో, స్క్రీన్ రైటర్ గానో ఆయన సేవలందించారు.
 
బాలచందర్ సినీ రంగంలోకి అడుగుపెట్టే నాటికే... కథలన్నీ హీరోచుట్టూ తిరుగుతుంటే.. ఈయన మాత్రం మహిళ చుట్టూ కథలు తిరిగేలా కొత్త పథంలో ముందుకు వెళ్లారు. మధ్య తరగతి జీవితాలనే కథలుగా మలుచుకున్నారు. అప్పట్లో ఉన్న ఆచారాలు, స్త్రీలపై ఉన్న కట్టుబాట్లు, స్త్రీలు ఎదుర్కొన్న బాధలు ఇవన్నీ ఆయన సినిమాల్లో మనకు కనపడతాయి. 
 
మరో చరిత్ర, అంతులేని కథ, ఆరంగేట్రం, సింధుభైరవి, ఇది కథ కాదు, రుద్రవీణ, అందమైన అనుభవం, బొమ్మా బొరుసా, గుప్పెడు మనసు, ఆకలి రాజ్యం... ఇలా చెప్పుకుంటూ పోతే, ఒక్కటేమిటి... ఆయన తీసిన సినిమాలన్నీ అద్భుతం, అమోఘం, అసమానభరితం. ఇవే సినిమాలను మరొకరు తీయగలరా అనేంత గొప్పగా సినిమాలను నిర్మించారు. మరో విషయం ఏమిటంటే, ఆయన సినిమాల్లోని హీరో ప్రత్యేకంగా కాకుండా... అందరిలా సామాన్యుడిలాగానే ఉంటాడు. 
 
భారతీయ సినిమా రంగానికి ఓ ఐకాన్ లాంటి రజనీకాంత్‌ను వెలికితీసింది బాలచందరే. 'అపూర్వ రాగంగల్' సినిమాలో ఓ పాత్రకు సరిపోయే నటుడి కోసం మద్రాసు మొత్తం జల్లెడ పట్టారాయన. నల్లటి రూపం, చురుకైన కళ్లు గల వ్యక్తి బాలచందర్‌కు అవసరం. చివరకు ఓ ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో రజనీని బాలచందర్ గుర్తించారు. శివాజీరావ్ గైక్వాడ్‌ను రజనీకాంత్‌గా మార్చి... సినీ పరిశ్రమను శాసిస్తున్న గొప్ప నటుడిని అందించారాయన.
 
1981లో 'ఏక్ దూజే కేలియే' సినిమాతో బాలచందర్ బాలీవుడ్ ఆరంగేట్రం చేశారు. తెలుగులో ఆయన నిర్మించిన 'మరో చరిత్ర'కు ప్రతిరూపమే ఏక్ దూజే కేలియే. ఈ సినిమా ద్వారానే కమల్ హాసన్, మాధవి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలు బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ సినిమాకు ఆయన 'ఫిలిం ఫేర్' బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు అందుకున్నారు. సినీకళామతల్లికి ఆయన చేసిన సేవలకు గాను కళైమామణి, పద్మశ్రీ, దాదాసాహెబ్ ఫాల్కే, అక్కినేని జాతీయ అవార్డులు ఆయనను వరించాయి. సినీ పరిశ్రమలో ఎంతో మంది 'చరిత్ర'లు సృష్టిస్తే... బాలచందర్ మాత్రం 'మరో చరిత్ర' సృష్టించి శాశ్వతనిద్రలోకి జారుకున్నారు.