శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : బుధవారం, 25 మార్చి 2015 (19:45 IST)

మా వల్లే 'మా' అభివృద్ధి.. అహర్నిశలు కృషి చేశా.. : మురళీమోహన్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (ఎంఏఏ - మా) ఎన్నికలు రచ్చకెక్కాయి. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం సహజనటి జయసుధ, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్‌లు పోటీ పడుతున్నారు. అయితే, ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు తీవ్రమైన విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ విమర్శల్లో రాజమండ్రి ఎంపీ, టీడీపీ నేత మురళీమోహన్‌ను ఉద్దేశించి నేరుగానే చేశారు. దీంతో ఆయన స్పందించారు. 
 
తనపై వస్తున్న వ్యాఖ్యలపై బాధతోనే మీడియా ముందుకు వచ్చినట్టు వివరణ ఇచ్చారు. రాజేంద్రప్రసాద్ ప్యానెల్ చేసిన వ్యాఖ్యలతో కలత చెందినట్టు చెప్పారు. 'మా' కోసం ఎంతో చేశానన్నారు. 'మా'కు సరైన ఆఫీస్ లేకపోతే, తన ఇంట్లోనే ఆఫీసును నడిపానని గుర్తు చేశారు. ఎన్నికలు జరిగితే అంతా సర్దుకుపోతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. 
 
మా నిధుల సేకరణ కోసం తన ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టి నిధులు సమకూర్చినట్టు తెలిపారు. అయితే, ఉన్న నిధులను ఖర్చు చేయడానికి చేతకాదా అని అనేక మంది ప్రశ్నించడం బాధ కలిగిస్తోందన్నారు. చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు చేయడం క్షణాల్లో చేయవచ్చని, కానీ ఉన్న నిధులను కాపాడుకోవడం చాలా కష్టమని ఆయన చెప్పుకొచ్చారు. 
 
తనపై విమర్శలు చేయడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. రాజేంద్రప్రసాద్ తనను 'అన్నయ్యా' అని ఆప్యాయంగా పిలుస్తాడని ఆయన చెప్పారు. ఇదేదో రాజకీయంలా కనిపిస్తోంది కానీ, సినీ కుటుంబంలో జరిగే చిన్న విషయమని ఆయన స్పష్టం చేశారు.
 
మరోవైపు... రాజేంద్ర ప్రసాద్ కూడా తనదైనశైలిలో స్పందించారు. మంచి మార్పు కోసమే 'మా' అధ్యక్ష పదవికి పోటీచేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తనతో పోటే చేసే స్థాయి, అర్హత ఎవరికీ లేదన్నారు. ఈ ధర్మ యుద్ధంలో మంచి చేయడానికి రావడమే తాను చేసిన పాపమా? అని ప్రశ్నించారు. సేవ చేయడానికి సంకల్పం ఉంటే చాలని భావించే వాడిని తానని తెలిపారు. 
 
హాస్యంతో సినీకళామతల్లికి సేవ చేశానని చెప్పారు. సంపాదించిన డబ్బుతో ఆస్తులు కూడబెట్టుకుంటూ, రియలెస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నారని... అవేవీ వారివెంట రావని మురళీమోహన్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. మా అధ్యక్షుడిగా ఉండే స్టేచర్ ప్రసాద్‌కి లేదంటూ మురళీమోహన్ తనతో అన్నారని నాగబాబు చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి మాట్లాడుతూ, తన స్టేచర్ గురించి మాట్లాడే స్థాయి ఎవరికీ లేదని... ఏడు కొండలపైన తనపేరు మీద ఓ కాటేజ్ కూడా ఉందని చెప్పారు.