శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2015 (12:28 IST)

మా ఎన్నికల ఫలితాలు.. మురళీ మోహన్‌ అహంకారానికి చెంపపెట్టా?

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కార్యవర్గానికి జరిగిన ఎన్నికల ఫలితాలు కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం వెల్లడించారు. ఈ ఎన్నికల ఫలితాల్లో మెగాస్టార్ బ్రదర్స్ మద్దతుపలికిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు. ఆయన చేతిలో టీడీపీ ఎంపీ, మా మాజీ అధ్యక్షుడు మురళీ మోహన్ బలపరిచిన సహజనటి జయసుధ చిత్తుగా ఓడిపోయారు.
 
ఈ ఎన్నికల్లో మొత్తం 394 ఓట్లు మాత్రమే పోల్ అయ్యాయి. అయిన 'మా' ఎన్నికల్లో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కు 237 ఓట్లు లభించాయి. ఆయన ప్రత్యర్థి సహజనటి జయసుధకు 152 ఓట్లు వచ్చినట్టు సినీ వర్గాలు వెల్లడించాయి. ఆయన 85 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని తెలిపాయి. 
 
అయితే, ఏకగ్రీవంగా సాగాల్సిన ఈ ఎన్నికలను టీడీపీ ఎంపీ మురళీ మోహన్ చేసిన రాజకీయం వల్ల అత్యంత ఉత్కంఠభరితంగా ఈ ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా ఆరు దఫాలుగా (12 యేళ్ళు) మా అధ్యక్ష పీఠాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్న మురళీ మోహన్.. మరోమారు ఆ పీఠాన్ని తన చేతుల్లోని జారిపోకుండా చేసుకునేందుకు తన సామాజిక వర్గానికి చెందిన సహజనటి జయసుధను రాత్రికి రాత్రే తెరపైకి తెచ్చి.. ఆఘమేఘాలపై చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలించి నామినేషన్ వేయించారు. 
 
ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలో ఇరు వర్గాల వారు వ్యక్తిగత దూషణల పర్వానికి దిగారు. ముఖ్యంగా.. జయసుధ ప్యానెల్ నుంచి పోటీ చేసిన చిన్న నటి హేమ మరింతగా రెచ్చిపోయి.. వ్యక్తిగత విమర్శలకు దిగారు. అలాగే, రాజేంద్ర ప్రసాద్ వర్గం కూడా ఆ విమర్శలకు ధీటుగానే సమాధానమిచ్చింది. అదేసమయంలో ఈ ఎన్నికల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు నటుడ ఓ కళ్యాణ్ కోర్టును కూడా ఆశ్రయించగా, కోర్టు అనుమతి మేరకు ఈ ఫలితాలను శుక్రవారం వెల్లడించారు. 
 
అయితే, మురళీ మోహన్ అనుసరించిన వైఖరి కారణంగా టాలీవుడ్‌లో రెండు వర్గాలు ఉన్నట్టు తేటతెల్లమైంది. పైగా, తన ఆధిపత్య పోరాటం కోసం జయసుధను బలిపశువును చేశారన్న వాదన టాలీవుడ్‌లో నెలకొనివుంది. అందుకే జయసుధ ఓట్ల లెక్కింపు కేంద్రాలకు రాకుండా తన ఇంటికే పరిమితమయ్యారు. పైగా తన ఓటమి గురించి ఆమెకు ముందుగానే తెలియడం వల్లే జయసుధ ఓటింగ్ కేంద్రాలకు రాలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే, ఈ ఓటమి జయసుధది కాదనీ మురళీ మోహన్ ఓడిపోయారని, ఆయన అహంకార ధోరణికి ఇది ఓ చెంప పెట్టువంటిదని పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తున్నారు.