శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 29 మార్చి 2015 (16:45 IST)

'మా’ పోల్ పోలింగ్ పూర్తి.. కోర్టు ఆదేశం మేరకే ఫలితాల వెల్లడి!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిశాయి. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 394 ఓట్లు పోలయ్యాయి. ‘మా’లో మొత్తం 702 ఓట్లు ఉన్నాయి. ఎప్పుడూ ఏకగ్రీవంగా జరిగే ‘మా’ ఎన్నికలు ఈసారి పోలింగ్ వరకూ వెళ్ళడంతోపాటు అధ్యక్ష పదవికి పోటీలో ఉన్న జయసుధ, రాజేంద్రప్రసాద్ వర్గాలు ఒకరినొకరు తిట్టుకోవడం, ఆరోపణలు చేసుకోవడంతో వార్తల్లో నిలిచాయి. 
 
‘మా’ ఎన్నికలతో ప్రజలకు ఎలాంటి సంబంధం లేకపోయినా, ఎవరు గెలిచినా జనానికి ఒరిగేదేమీ లేకపోయినా అందరూ ఈ ఎన్నికల మీద ఆసక్తి చూపారు. బాగా వార్తల్లో నానిన అంశం కాబట్టి ‘మా’లో సభ్యులు ఓట్లు వేయడానికి క్యూ కడతారని అందరూ భావించారు. అయితే ఓట్లు వేయడానికి వచ్చినవారు మాత్రం చాలా తక్కువ. చిన్నచిన్న వేషాలు వేసేవారు మాత్రం ఓటు వేయడానికి ఉత్సాహంగా వచ్చారుగానీ, స్టార్స్ మాత్రం పెద్దగా కనిపించలేదు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు 'మా' పోలింగ్ ముగిసింది.
 
అయితే, ఎన్నికల ఫలితాలపై ఎన్నికల నిర్వహణాధిరాకి కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. సిటి సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకే 'మా' ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉందని, న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చాకే ఈవీఎంలు తెరుస్తామని చెప్పారు. మొత్తం 7 ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించామని, చిత్రీకరించిన ఎన్నికల ప్రక్రియను ఈ నెల 31న కోర్టుకు అందిస్తామని తెలిపారు. 'మా' ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఈసారి 394 ఓట్లు నమోదయ్యాయని చెప్పారు.