గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By IVR
Last Modified: శనివారం, 19 జులై 2014 (21:55 IST)

అల్లుడు శీను కథ విని ఆశ్చర్యపోయాను... ప్రకాష్ రాజ్‌

వి.వి. వినాయక్‌ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్‌ నిర్మిస్తున్న 'అల్లుడు శీను' చిత్రంలో తాను ద్విపాత్రాభినయం చేశాననీ, తొలిసారిగా ఇలా నటించడం థ్రిల్‌గా ఉందని ప్రకాష్‌ రాజ్‌ తెలియజేస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేడుక సమయంలో అందుబాటులో లేకపోవడంతో మాట్లాడేందుకు వీలుపడలేదు. అందుకే వీలు చూసుకుని ఈరోజు వచ్చి మాట్లాడుతున్నానని శనివారంనాడు శ్రీలక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
 
వినాయక్‌తో 'దిల్‌' సినిమా నుంచి పరిచయం కొనసాగి మానవీయ కోణంలో మరింత సన్నిహితునిగా చేసింది. తను ఈ కథ చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. ఇటువంటి కథను తెరకెక్కించాలంటే తెలివితేటలు, నమ్మకం ఉంటేనే చేయగలరు. ఎన్నో భాషల్లో నటించినా ఈ కథ చాలా కొత్తగా అనిపించింది. ఇందులో రెండు పాత్రలను పోషించాను. బ్రహ్మానందంతో ఉండే సన్నివేశాలు, హీరోతో సాగే సీన్స్‌ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తాయి.
 
తెలుగులో కొత్తగా వస్తున్న కమర్షియల్‌ సినిమా ఇది. ఇక కథానాయకుడు సాయి శ్రీనివాస్‌ మొదటి సినిమా అయినా సీనియర్‌లా నటించాడు. భారీ నిర్మాత కొడుకుగా కాకుండా తన ప్రతిభ ఏమిటో చూపించాడు. టాలెంట్‌ ఉన్న స్టార్‌గా ఎదుగుతాడని చెప్పగలను అని చెప్పారు.
 
దర్శకుడు వినాయక్‌ తెలుపుతూ... చాలా బిజీగా ఉండే ప్రకాష్‌రాజ్‌ డేట్స్‌ దొరక్క మూడు నెలలు ఆగాం. కథ ప్రకారం తనే చేయాల్సిన పాత్ర. సాయి కొత్త అయినా ప్రకాష్‌రాజ్‌తో ఎటువంటి ఫీలింగ్‌ లేకుండా చేసేశాడు. కొత్త అబ్బాయి కోసం కొత్తగా చేసిన స్క్రీన్‌ప్లే ఇది. సమంత చాలా చక్కగా నటించింది. వచ్చేవారంలో సినిమాను విడుదల చేయనున్నామని తెలిపారు. నేను తీసిన 'ఆది' ఎలా అయిందో సాయికు అలా ఉంటుందనే ఆశ నాకుందని చెప్పారు.