శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By PNR
Last Updated : ఆదివారం, 31 ఆగస్టు 2014 (22:01 IST)

బాపు చనిపోలేదు... బాపు బొమ్మల్లో సజీవంగా ఉన్నారు : రాజేంద్రప్రసాద్

టాలీవుడ్ దిగ్గజం బాపు శాశ్వత నిద్రలోకి జారుకోలేదని, ఆయన కుంచె నుంచి జాలువారిన బొమ్మల్లో సజీవంగా ఉన్నారని హస్య కిరీటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం సాయంత్రం కన్నుమూసిన బాపు మృతిపై ఆయన స్పందిస్తూ... రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తిలో ఉన్న నటుడిని వెలికి తీసి వెండి తెరకు పరిచయం చేసింది బాపు - రమణలేనని గుర్తు చేసుకున్నారు. 
 
నిజానికి తన ప్రియనేస్తం ముళ్ళపూడి వెంకటరమణ చనిపోయాక, బాపు ఎంతోకాలం ఉండరని అనిపించిందని పేర్కొన్నారు. బాపు పాత్రలన్నీ మనకు దగ్గరగా అనిపిస్తాయని తెలిపారు. మహానటుడు ఎన్టీఆర్‌కు కూడా బాపుగారంటే ఎంతో ఇష్టమని గుర్తు చేశారు. ఇంట్లో బిడ్డలానే తనను బాపు చూశారని గుర్తు చేసుకున్నారు. 
 
కొందరు మనుషులు చనిపోయిన తర్వాత కూడా జీవించే ఉంటారనడానికి బాపు సిసలైన నిదర్శనం అని కీర్తించారు. ఆయన గీసిన బొమ్మలు, తీసిన సినిమాలు ఆయనను సజీవుడిగా నిలుపుతాయని అన్నారు. మాటల రచయిత ముళ్ళపూడితో బాపు ప్రస్థానం చాలా సుదీర్ఘమైనది. వీరిద్దరూ ఎన్నో చిత్రాలకుగాను బాధ్యతలు పంచుకున్నారని రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు.