శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 18 జులై 2014 (17:32 IST)

2 లక్షల్లో సినిమా.. వర్మ మ్యాజిక్‌!: పారితోషికం చెక్కుల రూపంలో!!

సినిమా అంటేనే ప్రస్తుత రోజుల్లో భారీ ఖర్చు అని అర్థమైపోయింది. తారల తళుకుబెళుకులకు తోడు కోట్లాది రూపాయల బడ్జెట్ వెచ్చించాల్సిందే. అయితే.. ‘శివ’ సినిమాతో సినీ పడికట్టు సూత్రాలను వెక్కిరించిన రామ్‌ గోపాల్‌ వర్మ.. తాజాగా ‘ఐస్‌క్రీమ్‌’ సినిమాతో తెలుగు సినిమా బడ్జెట్‌ మూసను బద్దలుకొట్టారు. 
 
అతి తక్కువ ఖర్చుతో సినిమా తీసి మరోసారి చరిత్ర సృష్టించారు. ఇంతకీ ఆ సినిమాకు అయిన ఖర్చెంతో తెలుసా? కేవలం.. 2,11,832 రూపాయలు! తెలుగు సినీ పరిశ్రమ ఊహించని మరో అద్భుతం కూడా ఈ సినిమా విషయంలో చోటు చేసుకుంది. అదేంటంటే.. సక్సెస్‌ మీట్‌లో చిత్ర బృందానికి పారితోషికం చెక్కుల పంపిణీ చేసి రికార్డు సృష్టించారు. 
 
2 లక్షల్లో సినిమా ఎలా తీశారని వర్మను అడిగితే.. రోజూ అందరూ పొద్దున్నే ఇంటిదగ్గరే టిఫిన్‌ చేసి రావడం.. మధాహ్నానికి కేరేజ్‌ తెచ్చుకోవడంతో చాలా ఖర్చు తగ్గిపోయిందన్నారు. మరి ఇతరత్రా షూటింగ్‌ పరికరాలకైనా ఖర్చయి ఉండాలి కదా? అనే సందేహానికీ రాము సమాధానమిచ్చారు. ‘ఐస్‌ క్రీమ్‌’ షూటింగ్‌లో లైట్లు, ట్రాక్‌ ట్రాలీలు, జిమ్మీజిబ్‌లు, స్టడీ క్యామ్‌లు.. ఏవీ వాడలేదని, ఫ్లోక్యామ్‌ టెక్నాలజీకి అవసరమైన గింబల్‌ రిగ్‌ను మాత్రమే వాడుకున్నట్టు చెప్పారు. 
 
ఫ్లో క్యామ్‌ టెక్నాలజీ వినియోగం వల్ల.. చిత్ర బృందం సంఖ్య 90 శాతం తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఆ రెండు లక్షల ఖర్చు కూడా సినిమా తీసిన ఇంటి అద్దెకు, టీలు, కాఫీలకు అయిన ఖర్చు అని వర్మ తెలిపారు. ‘‘ఈ సినిమా తీసిన ఇంటి ఓనర్‌ మా టీమ్‌లో భాగం కాదుగనక రెంట్‌ ఖర్చు తప్పలేదు’’ అని ఆయన చెప్పారు. 
 
కొన్ని పెద్ద బడ్జెట్‌ సినిమాలు సూపర్‌డూపర్‌ హిట్టయినా నిర్మాతలకు మాత్రం చివరికి విషాదమే మిగిలిన సందర్భాలున్నాయి. కానీ, రామ్‌గోపాల్‌ వర్మ మదిలో పుట్టిన ఈ కొత్త ఆలోచన.. సినిమా విఫలమైనప్పటికీ నిర్మాతను మాత్రం సేఫ్‌గా ఉంచింది. ఆయనొక్కరే కాదు.. ఈ సినిమాకు పని చేసిన బృందం మొత్తం ఆనందంగా ఉంది. ఆ విషయాన్ని నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్వయంగా చెప్పారు.